అక్కడ పసుపు దళాల్లో కొత్త ఉత్సాహం!

Wednesday, January 22, 2025

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెసుతో జట్టుకట్టినందుకు ఇంకా దారుణమైన పరాభవం మూటగట్టుకున్న తెలుగుదేశం ఇక కోలుకోవడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి కొత్త  ఆశలు చిగురిస్తున్నాయి. మిగిలిఉన్న పార్టీ కేడర్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు పార్టీ సారథ్య బాధ్యతలను సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ చేతుల్లో పెట్టిన తర్వాత.. పార్టీ స్థితిగతుల్లో తేడా కనిపిస్తోంది. 

తాజాగా కాసాని.. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని పునరుత్తేజితం చేయడం గురించి చర్చించారు. నిజం చెప్పాలంటే ఇన్నాళ్లపాటూ ఇలాంటి సమీక్ష సమావేశాలకు కూడా కరువే. చంద్రబాబునాయుడు స్వయంగా కొన్ని సమీక్షలు పెట్టేవాళ్లే తప్ప.. నియోజకవర్గం వారీగా పెట్టి చాలా కాలమైంది. 

పైగా ఈ సమావేశం సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తాం అని వెల్లడించారు. తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులకు అంతో ఇంతో ఉత్సాహం కలిగించేలా ఈ మాట చెప్పగలవాళ్లు కూడా ఇన్నాళ్లూ లేరు. అందుకే టీడీపీ కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డులు, సర్పంచి పదవులకు టీడీపీ అభ్యర్థులను ముందే నిర్ణయిస్తాం అని.. వారి ద్వారా నియోజకవర్గాల్లో పార్టీని తిరిగి బలోపేతం చేస్తాం అని కాసాని అంటున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీచేసే విషయంలో యువతరానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. 

నిజానికి ఈ మాటలన్నీ పార్టీకి ఉత్సాహం ఇచ్చేవే. ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆదరణ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు అయిపోకుండా.. ఇలాంటి ప్రయత్నాలు కొంత ఫలితం ఇస్తాయి. అయితే కేవలం కొత్త వారిని పోటీచేయించడం మాత్రమే కాకుండా.. సీనియర్లయిన, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన నాయకుల్ని తిరిగి తెలుగుదేశంలోకి  తీసుకురావడం మీద కూడా కాసాని జ్ఞానేశ్వర్ శ్రద్ధ పెడితే.. ఆయనకు దక్కిన పదవి సార్థకం అవుతుంది. ఇప్పటికే తెరాసలోను, కాంగ్రెస్ లోను ఉన్న తెలుగుదేశం నాయకులు అనేక మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. సరైన ప్రత్యామ్నాయం లేకపోయినందువల్ల మాత్రమే.. ఆయా పార్టీల్లో కొనసాగుతున్న వారున్నారు. కొందరు ఇష్టం లేకపోయినా బిజెపి వైపు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూడా చురుగ్గా బరిలో ఉంటుందనే నమ్మకం కలిగిస్తే.. సీనియర్ నాయకులు కూడా కొందరు తిరిగి తమ సొంత పార్టీ గూటికి చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పార్టీ నిజంగానే బలోపేతం అవుతుంది. ఎంతో కొంత వైభవ స్థితికి చేరుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles