రేవంత్ ను మరింత రెచ్చగొడుతున్న నారాయణ!

Sunday, December 22, 2024
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేయడం ద్వారా.. చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి గొప్పవారైనా సరే ఉపేక్షించేది లేదని.. కూల్చి తీరుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టమైన సంకేతాలు పంపింది. చెరువు భూభాగాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారందరికీ కూడా ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలాంటి కోవకు చెందిన గులాబీ నాయకులు.. తమ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే విమర్శలను కవచం లాగా తమ అక్రమాస్తులకు అడ్డుపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మొహమాటానికి పోకుండా కూల్చివేతల విషయంలో దృఢంగా ముందుకుసాగుతోంది.  వారికి మరింత కిక్ ఇచ్చేలాగా సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదు. ఒకే పార్టీ ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఎవరు ఆక్రమించినా సరే కూల్చివేతలు చేపట్టాలి.. ఇలాగే ముందుకు సాగాలి అని సిపిఐ నారాయణ మరింత ప్రేరణ ఇస్తున్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నారాయణ ప్రత్యేకంగా పరిశీలించారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తాం.. నాగార్జున బిగ్ బాస్ లకే బాస్. చెరువును ఆక్రమించుకొని కబ్జాలు చేశారు ఆయనేమీ సత్యహరిశ్చంద్రుడు కాదు.. సినిమా డైలాగులు పనికిరావు.. అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.
ఒకవైపు భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువు భూములను ఆక్రమించుకుని విద్యాసంస్థలు నిర్మించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలు నిర్మించినంత మాత్రాన ఉపేక్షించడానికి వీల్లేదని నారాయణ అంటున్నారు. ఆయా ఆక్రమ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఎవరు ఇచ్చారో ఆ అధికారుల మీద కూడా చర్యలు ఉండాలని ఆయన సెలవిస్తున్నారు. సిపిఐ అధికార కాంగ్రెస్ కు మిత్ర పక్షమే అయినప్పటికీ.. నాయకుడు నారాయణ మాటలు కూల్చివేతల బృందాలకు మరింత కిక్కు ఇస్తాయి అనడంలో సందేహం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles