తమ అధినేత చంద్రబాబు నాయుడును అరాచకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆగ్రహోదగ్రులు అవుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను కాస్త నియంత్రణలో పెట్టడానికి, అలాగే చంద్రబాబు నాయుడును నిందితుడిగా చూపేందుకు జరుగుతున్న కుట్రను సమర్ధంగా ఎదుర్కోవడానికి నందమూరి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటుండగా బాలకృష్ణ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తానని అంటున్న నందమూరి బాలకృష్ణ.. నేను వస్తున్నా ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు- తెలుగు వాడి సత్తా పౌరుషం ఏమిటో చూపిద్దాం అని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ విధ్వంసక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆ పాలన అంతమొందించేందుకు కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపు ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్లిన తర్వాత పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేసే వ్యక్తి కొరవడడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత గందరగోళంలో పడిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసిన అమానుషమైన తీరుపట్ల నిర్భయంగా తమ నిరసన తెలియజేస్తూ దూకుడుగా విరుచుకుపడగల నాయకత్వం ఇప్పుడు పార్టీకి అవసరం. బాలకృష్ణ ఆ లోటును భర్తీ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. లోకేష్ పూర్తిగా చంద్రబాబు నాయుడు మీద బనాయించిన కేసులకు సంబంధించిన సాంకేతిక అంశాలు, న్యాయపరమైన వివాదాలు, ఆయనను బయటకు తీసుకురావడానికి ఉండగల న్యాయపరమైన మార్గాలు గురించి అన్వేషించే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ మీద అంతే స్థాయిలో పూర్తి శ్రద్ధ పెట్టగల నాయకుడు కూడా కావాలి. అందుకే బాలయ్య రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తుంది.
ఆయన పార్టీ కార్యాలయంలోనే కూర్చుని కీలక నాయకులందరితోనూ విడివిడిగా సమావేశం అవుతున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే విషయంలో సమాలోచనలు చేస్తున్నారు. పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు చూస్తున్న నాయకుడి లాగా వ్యవహరిస్తున్నారు.
బాలయ్య ఎంట్రీ అనేది ఒక అవసరమైన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టులు, ఆయనపై ఉన్న కేసులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం తలొక రీతిగా సాగిపోకుండా ఒక స్పష్టతతో ముందుకు వెళ్లడానికి బాలయ్య నాయకత్వం ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.