ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి, విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను ఏదో ఒక్ నాటికి తిరిగి కలిపేస్తానని.. కూల్చబడిన జర్ర్మన్ గోడ ఇటుక సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏరీ? ఎక్కడ? ఏమైపోయారు? ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన. ఆ పార్టీ అధికారం కోసం ఆశపడుతూ ఎన్నికలను ఎదుర్కొంటున్న తెలంగాణలో గానీ, అటు ఏపీలో గానీ ఎందుకు ఎక్కడా కనిపించడం లేదు? ఇలాంటి కీలక సమయంలో అసలు సోదిలో లేకుండాపోయారేమిటి? అనే సందేహాలు ఇప్పుడు పలువురిలో కలుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తే గనుక.. మేలు కంటే చేటు ఎక్కువగా జరుగుతుందనే భయం కారణంగానే.. ఆయనను పార్టీ దూరం పెట్టినట్టుగా పలువురు అనుకుంటున్నారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఏదో ఒకనాటికి రెండు రాష్ట్రాలను కలిపేస్తానని ప్రకటించిన తర్వాత.. సొంతంగా ఒక పార్టీ స్థాపించి.. ఏపీలో ఎన్నికలను ఎదుర్కొన్నారు. డిపాజిట్లు కూడా దక్కలేదు. తర్వాత చాలాకాలం సైలెంట్ గా ఉండిపోయారు. చాన్నాళ్లకు తిరిగి కాంగ్రెసుతో కలిశారు. అయినా సైలెంట్ గానే ఉన్నారు. చివరికి కొన్నాళ్ల కిందట భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ ప్లాన్స్ ఏమిటి అని అడిగితే.. తాను తెలంగాణకు కూడా ‘లోకల్’ నాయకుడిని అవుతానని, చిత్తూరు జిల్లాకు కూడా లోకల్ అని ఆయన సెలవిచ్చారు. ఇక్కడా ఉంటా.. అక్కడా ఉంటా అన్నట్టుగా మాట్లాడారు. చివరికి పొరుగు రాష్ట్రం బెంగుళూరులో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా పార్టీ ఆయన సేవలను వాడుకుంది. అక్కడకు వెళ్లి ఎన్నికలదిశగా ఆయన కాస్త పనిచేశారు.
కానీ తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికి నల్లారి కిరణ్ అస్సలు కనిపించడం లేదు. ఏమైపోయారో తెలియదు. కానీ ఆయన పార్టీలోకి రావడం వలన జరిగిన చేటు మాత్రం బిజెపికి ఉంది. కిరణ్ వంటి తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వస్తున్నదంటూ.. అలిగిన రాములమ్మ విజయశాంతి బిజెపిని వీడి, కాంగ్రెసులోకి వెళ్లిపోయారు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగపడగల విజయశాంతి వెళ్లిపోవడం నష్టమే. అలాగని కిరణ్ కుమార్ రెడ్డి వలన భాజపాకు ఏమైనా లాభం ఒనగూరిందా అంటే అది కూడా కనిపించడం లేదు. ఆయనకు ఏపీ రాష్ట్రంలో కూడా ఏమాత్రం ప్రాభవం లేదని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అతి కష్టపడి తెలుగు మాట్లాడుతూ హడావుడి చేసే ఈ ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం హఠాత్తుగా కీలక సమయంలో అదృశ్యం అయిపోవడం చర్చనీయాంశంగా ఉంది.
సోదిలో లేకుండాపోయిన సీనియర్ నేత!
Wednesday, January 22, 2025