విశాఖపట్నానికి ప్రధానమంత్రి వచ్చి పోయిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రపూరిత వక్ర ప్రచారాలను వ్యాప్తిలో పెడుతోంది. జనసేనతో తెదేపా పొత్తులు లేనట్టే అనే ప్రచారాన్ని వారు బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయితే అవన్నీ అబద్ధాలే అని నాదెండ్ల ప్రకటనతో తేలిపోయింది. పొత్తులు కుదరవు అనే మాట ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలనుకుంటున్న వైసీపీ శ్రేణులకు నాదెండ్ల మాటలకు పెద్ద షాక్!
పవన్ కళ్యాణ్ అసలు నరేంద్ర మోడీని కలవనేలేదని బయటకు వచ్చి కలిసినట్లుగా బిల్డప్ ఇచ్చారని, కలిసి ఉంటే కనీసం ఫోటోలు బయటకు వచ్చేవి కదా అని సందేహాలు వ్యక్తం చేస్తూ మొదటి రోజునే ఒక విషపూరితమైన ప్రచారం వైసీపీ వారు ప్రారంభించారు. రెండో రోజుకు పవన్ తో మోడీ భేటీ అయిన దృశ్యాలన్నీ విడుదలయ్యాయి. కుట్ర ప్రచారం చేసిన వారి నోర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత మరో రకం విష ప్రచారాలను ప్రారంభించారు.
తెలుగుదేశంతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ కు ప్రధాన నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారని.. పొత్తు లేకుండా జనసేన బిజెపి మాత్రమే విడిగా బరిలోకి దిగేలా మార్గనిర్దేశం చేశారని ఇంకొక ప్రచారం ప్రారంభించారు. వీటన్నింటికీ పరాకాష్ట ఏమిటంటే బహిరంగ సభ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గురించి నరేంద్ర మోడీ సానుకూలంగా మాట్లాడిన విషయాలపై ప్రచారం. ‘మాది రాజకీయాలకు అతీతమైన బంధం’ అని జగన్ బిల్డప్ ఇచ్చుకున్నారే తప్ప ఆ మాట నరేంద్ర మోడీ చెప్పలేదు. కానీ జగన్ పట్ల మోడీలో విపరీతమైన ఆదరణ ఉన్నట్టుగా వైసిపి కోటరీ ప్రచారంలో పెట్టింది. అందువలన టిడిపి జనసేన పొత్తులు ఏర్పడకుండా మోడీనే చర్యలు తీసుకుంటారనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది.
అయితే ఇలాంటి వక్ర ప్రచారాలకు ఏకపక్షంగా తెరదించుతూ నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. తిరుపతికి వెళ్లిన నాదెండ్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనవ్వం అనే సంగతిని మరో మారు స్పష్టం చేశారు. నాదెండ్ల మాటల అర్థం బిజెపి ఓటును కూడా పక్కకు పోనివ్వకుండా కూటమిలో ఉంచేలాగా ఉన్నది.. అనే విశ్లేషణ ఇప్పుడు వినిపిస్తోంది. నిజానికి జగన్ వ్యతిరేక ఎజెండాతో ఉన్న జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడం భారమే. తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకుంటే అందులో బీజేపీ ఉంటుందా? లేదా? అనేది అప్పుడే తేల్చి చెప్పడం కష్టం. బిజెపి ఉన్నా లేకపోయినా కూడా టిడిపి– జనసేన కూటమికి కచ్చితంగా అడ్వాంటేజీ ఉంటుంది అని ఇరు పార్టీల నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భయం కూడా అదే. ఆ పొత్తు కుదరకుండా బిజెపి ద్వారా నరుక్కు రావాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. మోడీ పట్ల అతి విధేయత కనపరిచేదంతా కేవలం అందుకోసమే! అయితే ఆయన ప్లాన్లు వర్క్ అవుట్ కావు అని స్పష్టీకరిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చే అవకాశం లేదని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పడం మనం గమనించాలి. తమకున్న ఒక్క శాతం ఓటు బ్యాంకుతో భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉండడానికి ఇష్టపడుతుందా లేదా ఒంటరిగా మిగులుతుందా అనేది వారే తేల్చుకోవాలి.