అధికారంలో ఉన్నంత కాలం.. తమ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పోలీసు అధికారుల్ని తమ చెప్పుకింది చీమల్లా చూస్తూ వచ్చారు. తమ చెప్పుచేతల్లో ఉండాలన్నట్టుగా వారిని ఆదేశిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి అంత ఏకపక్షంగా లేదు. కంట్రోల్ యూనిట్ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ముఖేష్ కుమార్ మీనా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏజంట్లు ఎవరైనా సరే అతిగా వ్యవహరిస్తే, అవాంతరాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏ చిన్నఅల్లరి చేసినా సరే.. బయటకు పంపేస్తామని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. అల్లర్ల మీదనే ఆధారపడి ఆశలు పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మీనా మాటలు హెచ్చరికలాగా కనిపిస్తున్నాయి.
పోలింగ్ సందర్భంగాను, పోలింగ్ అనంతర పరిణామాల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పోలింగ్ ముగిసిపోయిన తర్వాత కూడా రెండు మూడురోజుల పాటూ చాలా తీవ్రస్థాయిలో ఘర్షణలు, దొమ్మీలు, దాడులు, హత్యాయత్నాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా సెక్షన్ 144 కొనసాగుతూనే ఉంది. అసలు ఘర్షణలు చెలరేగిన తీరును, పరిస్థితులు విషమించిన క్రమాన్ని గమనిస్తే.. కొన్ని ప్రాంతాల్లో మరో ఏడాది పాటు అయినా పోలీసు పికెట్లను, క్యాంపులను నిర్వహించాల్సి వస్తుందేమో అనిపించేంతగా వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో.. ఇటీవలి అల్లర్ల ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగు రోజునాడు కనిపించడానికి వీల్లేదని మీనా అంటున్నారు.
పోలింగ్ నాడు అల్లర్లకు పాల్పడినట్లే కౌంటింగ్ నాడు కూడా అల్లర్లు చేయడం ద్వారా పరిస్థితుల్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తున్నది. రూల్సు పాటించాలనుకునే వాళ్లు అసలు తమకు కౌంటింగ్ ఏజంట్లుగా వద్దేవద్దని సజ్జల కార్యకర్తలతో చెప్పడం వెనుక మర్మం ఇదే. కాకపోతే.. ఇప్పుడు ఎన్నికల అధికారి మీనా కఠినంగా వ్యవహరిస్తుండడం.. ఆ పార్టీకి వారికి హెచ్చరికగానే భావించాలి.
మీనా మాటలు వైసీపీకి హెచ్చరికే!
Sunday, December 22, 2024