ఆ ఇద్దరినీ అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తథ్యం!

Thursday, December 4, 2025

ఆల్రెడీ జైల్లో ఉన్నవారు బెదిరిపోయి.. తమకు బెయిలు కావాలి మొర్రో అంటూ కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవడం వింత విషయం ఎంతమాత్రమూ కాదు! కానీ.. నిందితులుగా తొలినుంచి తమ పేర్లు ఉన్నప్పటికీ.. విచారణకు హాజరు కావడం తప్ప.. ఇప్పటిదాకా అరెస్టు కాని వ్యక్తులు కూడా.. ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేసుకుంటున్నారంటే.. ఎవరికైనా సరే.. దాల్ మే కుఛ్ కాలా హై అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో అదే జరుగుతోంది. ఈ కేసులోు ఏ2, ఏ3 గా ఉన్న ఇద్దరు అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ లు ముందస్తు బెయిలు కోసం వేసుకున్న పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దాంతో వీరిద్దరు అరెస్టు అవుతారనే ప్రచారం మొదలైంది. నిజానికి, ఏ2, ఏ3 అయిన ఈ ఇద్దరినీ అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే గనుక.. మరిన్ని సాధికారమైన వివరాలు, మద్యం కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.

మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ గురించి అంతిమ లబ్ధిదారుగురించి గానీ పేరు ప్రస్తావించకుండానే.. ఇప్పటికి 40కి పైగా నిందితులు ఉన్నారు. 12 మంది దాకా జైల్లో రిమాండులో గడుపుతున్నారు. కాగా ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి మొదటి నిందితుడు. వసూళ్ల నెట్వర్క్ మొత్తం తన మనుషులతో నడిపించి, డిస్టిలరీలను బెదిరించి వసూళ్లు రాబట్టిన చాతుర్యానికి ఆయనకు దక్కిన క్రెడిట్ అది. అలాగే.. అప్పట్లో జగన్ ఏర్పాటుచేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి, ఎక్సయిజు శాఖకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ లు ఏ2, ఏ3 లుగా ఉన్నారు. వీరిద్దరూ ఆశాఖకు చెందిన వారు కాదు.

వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీఃసుల నుంచి, సత్యప్రసాద్ ఇతర శాఖ నుంచి జగన్ సేవకోసం, ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం, ఆయన ఖజానాలో వేల కోట్లు నింపడంకోసం..  డిప్యుటేషన్ పై వచ్చారన్నమాట. అసలు పాలసీ రూపకల్పన దగ్గరినుంచి డిస్టిలరీలకు ఆర్డర్లు పెట్టడం.. ఆర్డర్ల ప్రకారం ఎవరినుంచి ఎంత దందా వసూలు చేయాలో రాజ్ కెసిరెడ్డి  దళాలకు సమాచారం పంపడం, వాటాలు ఇవ్వని వారికి ఆర్డర్లు కట్ చేయడం లాంటి కీలకమైన పనులన్నీ చేసింది ఈ ఇద్దరు అధికారులే.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. తొలుత వీరిద్దరినే సిట్ విచారించింది.

వీరిద్వారా అందిన సమాచారం ఆధారంగానే రాజ్ కెసిరెడ్డి ని కూడా నిందితుల్లో చేర్చారు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులను తొలివిడతలో విచారించారు. ఆ తర్వాత ఒక్కటొక్కటిగా అనేక వాస్తవాలు వెలుగులోకి రావడం, అనేకమంది నిందితుల జాబితాలో చేరడం జరిగింది. ఇప్పుడు ఆ ఇద్దరు అధికారులు కూడా ముందస్తు బెయిలు కోరుకుంటూ పిటిషన్లు వేయగా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే.. ఇప్పటిదాకా చాలా వివరాలు అందినందున.. సిట్ పోలీసులు ఈ ఇద్దరిని కూడా అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ చేసి.. అన్ని వాస్తవాలను ధ్రువీకరించుకోవడం వల్ల కేసులో మంచి పురోగతి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles