‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని ప్రతి వేదికమీద చెప్పుకుంటూ.. వైఎస్ జగన్ జైల్లో ఉండగా.. రాష్ట్రమంతా పర్యటించి పార్టీని సజీవంగా ఉంచిన నాయకురాలు వైఎస్ షర్మిల. ఆ రకంగా ఆమె రాజకీయాల్లో ‘బాణం’ అనే పదానికి పర్యాయపదంగా మారిపోయారు. ఇప్పుడు రాజకీయ తాజా పరిణామాలను గమనిస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ బాణాన్ని తొలుత తన అమ్ముల పొదిలోకి చేర్చుకుని, నెమ్మదిగా సమయం చూసి.. ఏపీలో జగన్ మీదికే సంధించే ఆలోచన చేస్తున్నట్టుగా కొందరు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో షర్మిల హాట్ టాపిక్ అయ్యారు. ఆమెను అరెస్టు చేస్తే.. అక్కడితో ఊరుకోకుండా.. రెండోరోజున ప్రగతి భవన్ ను ముట్టడించడానికి చేసిన దూకుడైన ప్రయత్నం.. ఆ సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అతి అన్నీ కలిసి ఆమెను మరింత సంచలనాత్మక వ్యక్తిగా రాజకీయాల్లో నిలిపాయి. అయితే జీ20 సదస్సు సందర్భంగా జగన్ ను కలిసినప్పుడు.. మీ చెల్లెలికి అంత అన్యాయం జరిగితే నువ్వు పట్టించుకోలేదా అని ప్రధాని మోడీ అడిగినట్టుగా ఒక ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా లీకైందనే సందేహం పలురికి ఉన్నప్పటికీ.. ఆ పుకారు చాలా వేగంగా వ్యాపించింది. దానికి తగ్గట్టే.. ప్రధాని మోడీ షర్మిలకు ఫోను చేసి ఏకంగా పది నిమిషాలు మాట్లాడారనే సంగతి కూడా వ్యాప్తిలోకి వచ్చింది. షర్మిల బిజెపి వదిలిన బాణం అనేది నిజమే అని గులాబీ దళాలు మళ్లీ ప్రచారం ప్రారంబించాయి.
ఇదొక తరహా అయితే మరో విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. ఆమె బిజెపి బాణం నిన్నటిదాకా కాకపోవచ్చునని.. ఇప్పుడు ఆమెను తమ జట్టులో కలుపుకునే ఆలోచన బిజెపి చేస్తుండవచ్చునని కూడా కొందరు అంటున్నారు. షర్మిల ఇప్పటిదాకా తెలంగాణలో 3500 కిమీల పాదయాత్ర పూర్తిచేశారు. కేసీఆర్ మీద విరుచుకుపడడంలో తనదైన శైలి చూపిస్తున్నారు. అలాంటి దూకుడైన నాయకురాలిని తమ జట్టులోనే ఉంచుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని కమలదళం తలపోస్తే ఆశ్చర్యమేమీ లేదు. పైగా కేసీఆర్ సర్కారు ఒక కులానికి పరిమితం అవుతోందని, పెద్దపీట వేస్తుందని ప్రచారం ఉన్న నేపథ్యంలో.. షర్మిల ద్వారా రెడ్డి కులాన్ని చేరదీయవచ్చునని, ఆ రకంగా వైఎస్ ను అభిమానించే తెలంగాణ కాంగ్రెస్ వాదులందరినీ కమలం వైపు ఆకట్టుకోవచ్చునని ఒక స్కెచ్ వేశారనే వాదన ఉంది.
అదే సమయంలో షర్మిల కమలతీర్థం పుచ్చుకోవడమే గనుక జరిగితే.. ఆమెను ఏపీ రాజకీయాల్లోకి కూడా ఎక్కుపెట్టి.. జగన్ మీదకు ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే.. జగన్ అవినీతి బాగోతాల గురించి షర్మిల కంటె బాగా చెప్పగలిగిన వారు ఉండకపోవచ్చు. విశాఖకు వచ్చినప్పుడు జగన్ అవినీతిపై చార్జిషీట్ తయారుచేయమని పార్టీ దళాలకు మోడీ చెప్పారు. వారు పట్టించుకున్న పాపాన పోలేదు. అదే షర్మిల ద్వారా అయితే.. వైసీపీని బలహీన పరచడం కూడా చిటికెలో పని అని కమలనాధులు తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.