చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోజా.. నియోజకవర్గంలో ఇసుక, లిక్కర్, బియ్యం అన్నీ స్మగ్లింగ్ జరుగుతున్నాయంటూ.. తోచిన ఆరోపణలెల్లా చేసేస్తున్నారు. అదే సమయంలో.. ఎమ్మెల్యేను విమర్శించడం తన స్థాయి కాదని, తన స్థాయి అంతకంటె పెద్దదని చాటుకోవడానికి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ లను కూడా తిట్టిపోస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే ప్రతివిమర్శలు చేయకుండా ఊరుకోవడం సాధ్యం కాదు కదా. ఆ క్రమంలో చేసిన విమర్శలను కూడా ఆమె గురించి బూతులు మాట్లాడినట్టుగా, అసభ్యపు విమర్శలు చేసినట్టుగా చిత్రీకరించి.. ఆడిపోసుకుంటున్నారు.
రాజకీయం ఎలా తయారవుతున్నదంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాగా.. అత్యంత నీచంగా అసభ్యపు కారుకూతలు కూడా మహిళా నాయకురాలిని దూషిస్తారు. దానిని సభ్య సమాజం మొత్తం ఈసడించుకుంటుంది. అయితే.. తమను కూడా తెలుగుదేశం నాయకులు అదే స్థాయిలో తిడుతున్నారు.. అని నిరూపించుకోవడం వారికి అవసరం. కానీ తెలుగుదేశం వారు అంత నీచంగా వారిని విమర్శించడం లేదు. దాంతో వైసీపీ నాయకులు ఒక ఎత్తుగడ వేశారు. తెదేపా వాళ్లు తమ మహిళా నాయకురాళ్లపై ఎలాంటి విమర్శలు చేసినా సరే.. అవే అసభ్యపు బూతులు అన్నట్టుగా చిత్రీకరిస్తూ ప్రెస్ మీట్లు ప్రజల ముందు విలపించాలి.. అని! ఇప్పుడు నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్న మాటలను వారు వక్రీకరిస్తున్న తీరు అలాగే కనిపిస్తోంది.
గాలి భాను ప్రకాష్ గురించి, ఇతర కూటమి పెద్దల గురించి రోజా నానా మాటలూ అన్నారు. గాలి భానుకూడా ఆమెను హీరోయిన్ కు తక్కువ- వ్యాంప్ కు ఎక్కువ- అని విమర్శించారు. నిజానికి ఈ విషయంలో అబద్ధమేమీ లేదు. హీరోయిన్ వేషాలు చాలా పరిమితకాలం మాత్రమే వేసి.. రోజా కేరక్టర్ పాత్రల్లోకి మారవలసి వచ్చింది. అలాగే ఆమె కెరీర్ లో వ్యాంప్, ఐటెమ్ సాంగ్స్ కూడా చేశారు. ఈ మాటల తర్వాత.. రెండువేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది అని కూడా గాలి భానుప్రకాష్ అ న్నారు.
అయితే ఇది కేవలం ఆమె పాల్పడే అవినీతికి సంబంధించిన మాట మాత్రమే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
ఆమె సామాన్యులకైనా పనులు చేసిపెట్టడానికి చిన్న మొత్తాలు కూడా లంచాలు తీసుకుంటుందని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నారు. ఎమ్మెల్యే హోదాలో తిరుమల దర్శనాలకు తనతో పాటు ప్రోటోకాల్ దర్శనాలకు ప్రతినెలా కొత్త వ్యక్తులను గుంపులుగా తీసుకువెళుతూ వారికి దర్శనం టికెట్లను రోజా అమ్ముకుంటుందనే విమర్శలు కూడా గతంలో చాలా వచ్చాయి. ఇది కూడా అలాంటి అవినీతికి సంబంధించిన మాటే! అయితే.. జగన్ దళాలు తమ నీలి బుద్ధులతో దీనిని పెద్ద బూతుగా చిత్రీకరిస్తున్నారు. రోజా శీలం గురించి ఈ మాటలు అన్నట్టుగా వక్రీకరిస్తూ.. వైసీపీ నాయకులందరూ ఆమె పరువు మరింతగా తీయడానికి దిగాజరుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.
