ప్రభుత్వం మీద బురద చల్లాలి అనేంత వరకే జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఉంది. ఎందుకు బురద చల్లాలో ఆయనకు ఇంకా తెలియదు. అందుకోసం సుమారు నెలన్నర రోజులు ఆలోచించి.. ఆ తర్వాత డిసైడ్ చేసే ఉద్దేశంతో ఉన్నారాయన. ఇది ఎవరో జగన్ అంటే కిట్టని వారు చేస్తున్న ఆరోపణ మాత్రమే అనుకుంటే పొరబాటు. సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ జిల్లా అధ్యక్షులతో తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశం నిర్వహించి.. మీరందరూ రెడీగా ఉండాలి.. జూన్ నెలలో ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా.. మనం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి అని దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఏ అంశాల మీద నిరసనలు చేయాలో.. తర్వాత చెబుతారట. ఇదీ పార్టీ నిర్వహణ మీద జగన్ కు ఉన్న క్లారిటీ అని ఆ పార్టీ నాయకులే విస్తుపోతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ జిల్లా అధ్యక్షులతో ఓ సమావేశం నిర్వహించారు. యథావిధిగా ప్రభుత్వాన్ని ఎప్పుడూ తిడుతున్న చందంగానే తిట్టిపోశారు. మీరే పార్టీ.. మీరే పార్టీని గెలిపించాలి.. పార్టీని నడిపించే బాధ్యత కూడా మీదే అంటూ రకరకాలుగా వారిని ఊదరగొట్టారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది డిసెంబరులో జనవరిలో సంక్రాంతి తర్వాత తాను జిల్లాల యాత్ర చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ప్రతి నెలా రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో పూర్తిగా ఉంటానని, అక్కి అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం అవుతానని.. పార్టీకి కొత్త జవజీవాలు తీసుకువస్తానని రకరకాలుగా ఆయన ఊదరగొట్టారు.
సంక్రాంతికి కాదు కదా.. ఆయన తన తాడేపల్లి, బెంగుళూరు ప్యాలెస్ లు వదలి జిల్లాల యాత్రకు వెళ్లడం నాలుగునెలలు గడుస్తున్నా ఇంకా మొదలు కాలేదు. తన మాటలు ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారులెమ్మని.. ఆయన చాలా కన్వీనియెంట్ గా జిల్లా యాత్ర అనే పదాన్నే పక్కకు పెట్టేశారు. ఆయన స్వయంగా జిల్లాలకు వస్తే.. ఏదో కాస్త పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని అనుకుంటున్న స్థానిక నాయకులకు నిరాశే మిగిలింది. అయితే జిల్లాల యాత్ర చేసి.. ఏ అంశాల మీద ప్రభుత్వాన్ని విమర్శించాలనే విషయంలో జగన్ కు క్లారిటీ లేదని, సబ్జెక్టులు దొరకడం లేదని.. అందుకే మీమాంసలో ఉన్నారని సమాచారం.
సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదు.. అంటూ జగన్ పదేపదే ఊదరగొడుతుంటారు. కానీ.. అందుకు అయిదేళ్ల సమయం ఇచ్చాం కదా.. ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అన్నీ చేస్తుంది.. అనే నమ్మకాన్ని ప్రజలు చూపిస్తున్నారు తప్ప.. జగన్ గోలను పట్టించుకోవడం లేదు. తన విలాపాలకు ప్రజల్లో మద్దతు దక్కడం లేదని జగన్ కు సొంత సర్వేలు తెలియజేస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే సందర్భంలో నిరసనలు చేయాలనుకుంటున్నారు తప్ప ఎందుకు చేయాలనుకుంటున్నారో క్లారిటీతో లేకపోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క అపరిపక్వతకు నిదర్శనం అని పార్టీనేతలే అంటున్నారు.
