తమరు గెలిచిన బ్యాలెన్స్ జగనన్న గెలుస్తారేమో!

Sunday, December 22, 2024

ఇంట గెలిచి రచ్చగెలవాలనేది సామెత! ఆ పార్టీ వారికి ఇంట గెలిచే దిక్కులేదు గానీ.. రచ్చమీద పెద్దరికం చెలాయించడానికి సిద్ధమయ్యే వారిని ఏం అనాలి. ఇప్పుడు తెలంగాణలోని గులాబీదళం నాయకుల ఓవరాక్షన్ చూస్తే అలాగే అనిపిస్తోంది. హాయిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును.. అక్కడికేదో వారు దేశోద్ధారక బ్యాచ్ లాగా భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నారు. ఆ సమయంలో.. ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరేస్తామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ శాఖలు ఏర్పాటుచేస్తున్నాం అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని నరేంద్రమోడీకి చుక్కలు చూపిస్తాం అని ఎగిరెగిరి పడ్డారు. తీరా ఏమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు! పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి పలికిన ప్రగల్భాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. తెలంగాణ గడప దాటి ఏ ఒక్క సీటులో కూడా పోటీచేయడానికి వారికి ధైర్యం చాలలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ , బిజెపి మత్తగజాల్లా పోరాడుతూంటే.. మధ్యలో పిపీలికంలాగా భారాస ఉంది. గులాబీ దళానికి తెలంగాణలో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటు వస్తుందో, రెండు సీట్లు వస్తాయో తెలియదు. అలాంటి దుస్థితిలో ఉన్న ఆ పార్టీ నాయకులు.. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తారంటూ జోస్యం చెప్పడానికి సాహసిస్తున్నారు. జగన్ విజయాన్ని కోరుకుంటూ.. తమకు జగన్ గెలుస్తాడనే సమాచారం ఉందని చెబుతున్న గులాబీ తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ ల మాటలు విని.. తెలంగాణ అసెంబ్లీలో తమరు గెలిచిన బ్యాలెన్స్.. ఏపీ అసెంబ్లీలో తమ ఆత్మీయుడు జగన్ గెలుస్తారేమో అని జనం నవ్వుకుంటున్నారు.
గులాబీ దళపతి కేసీఆర్ గతంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎన్నికల్లో జగన్ రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకుంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’’ అంటూ జోస్యం చెప్పారు.
కాగా సోమవారం నాడు కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారక రామారావు.. తాను ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల మీద తన తండ్రి చెప్పిన జోస్యాన్ని పునరుద్ఘాటించారు. ‘అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సోదరుడి వంటి వారని.. అక్కడ ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని’ కేటీఆర్ అన్నారు.
ఏపీ ఎన్నికల గురించి ఈ గులాబీ తండ్రీ కొడుకుల మాటలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి. తెలంగాణలో సెటిలైన ఏపీ వాసులంతా ఓటు వేయడానికి వెల్లువెత్తిన తీరును గమనించిన తర్వాత కూడా వారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే.. జనం నాడిని గ్రహించే శక్తిని ఎన్నడో కోల్పోయినట్లేనని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles