షర్మిలకు కొండా అండ!

Friday, November 22, 2024

తెలంగాణలో రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న వైఎస్ షర్మిలకు త్వరలో కొత్త బలం చేకూరనుందా? సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల అనన్యమైన భక్తి, వారి కుటుంబంతో ఎంతో దగ్గరి సంబంధం ఉన్న కొండా సురేఖ.. వైతెపాలో చేరుతారా? అనే సందేహాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొండంత అండ అని చెప్పడం కష్టం గానీ.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమ సొంత ముద్ర కలిగిఉన్న కొండా కుటుంబం షర్మిల వెంట నడవడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ కమిటీ తాజా కూర్పులపట్ల అసంతృప్తితో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వానికి కొండా సురేఖ రాజీనామా కూడా చేయడం ఈ సందేహాలకు మరింత ఊతమిస్తోంది. 

కొండా సురేఖ- మురళి దంపతులు వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన వ్యక్తులుగా ముద్ర ఉంది. వైఎస్ఆర్ జమానాలో వీరి హవా బాగా సాగింది. కొండా సురేఖ మంత్రి కూడా అయ్యారు. వైఎస్ మరణించిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం పట్టించుకోకుండా పూర్తిగా వైఎస్ కుటుంబం కోసం మాత్రమే నిలబడిన తొలి వ్యక్తులలో కొండా సురేఖ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ను స్థాపించిన తొలిరోజుల్లో.. కొండా సురేఖ ఆ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రతి విషయంలోనూ వారి సొంత కుటుంబంలాగా మెలగుతూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఆమెకు అంతగా ప్రాధాన్యం ఉండేది. 

కాలక్రమంలో ఆమె జగన్ తో విబేదించి.. వారి పార్టీకి దూరం జరిగారు. చివరికి మళ్లీ కాంగ్రెస్ పంచన చేరారు. కానీ మునుపటిలాగా ఆమె కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రాధాన్యం తగ్గింది. వేరే మార్గంలేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా మాత్రమే వారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు పీసీసీ కూర్పు తర్వాత.. కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. తనకంటే జూనియర్లకు కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారంటూ ఆమె రుసరుస అన్నారు. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉన్నాం అని.. పదవులకు రాజీనామా చేసినా వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకుంటానని సురేఖ అంటున్నారు. సాధారణ కార్యకర్తలా కాంగ్రెస్ లో కొనసాగుతానంటున్నారు. 

ఈ మాటలన్నీ పార్టీని వీడిపోయే సంకేతాల్లాగానే కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంతో ఉండే సాన్నిహిత్యం దృష్ట్యా, పైగా ఇప్పుడు వైఎస్ షర్మిలకు తెలంగాణలో క్రేజ్ బలపడుతున్న దృష్ట్యా కొండా సురేఖ- కొండా మురళి కుటుంబం ఆమె వెంట నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల మినహా ఇప్పటిదాకా పార్టీలో పెద్దదిక్కు, సీనియర్ నాయకులు ఎవ్వరూ లేని వైతెపాకు కొండా సురేఖ వస్తే గనుక.. కొంత ఎడ్వాంటేజీ ఉంటుందని అనుకోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles