ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగింది. అది హత్యాయత్నం అని.. కోడికత్తితో భుజం మీద పొడిచి ఆయనను చంపేయడానికి ప్రయత్నించారని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద రభస చేసింది. కనీసం విశాఖలో ఆస్పత్రికి కూడా వెళ్లకుండా, ఏపీలో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. అక్కడి వ్యవస్థల మీద తనకు నమ్మకం లేదని, విమానంలో హైదరాబాదు వచ్చేసి ఇక్కడ చికిత్స చేయించుకున్నారు జగన్! ఈ హత్య వెనుక పూర్తిగా తెలుగుదేశం హస్తం ఉన్నది గనుక.. ఏపీలో చికిత్స చేయించుకున్నా ఆయనను చంపేస్తారని, అక్కడ పోలీసుకేసు పెట్టినా.. జగన్ నే ఇరికిస్తారని వైఎస్సార్ సీపీ అప్పట్లో బీభత్సంగా ప్రచారం సాగించింది. దానివలన లబ్ధి కూడా పొందింది. ‘జగన్ మీద హత్యాయత్నం జరిగింది’ అనేమాట ఆయనపట్ల ప్రజల్లో కొంత జాలి పుట్టించింది. ‘ఒక్క చాన్స్’ నినాదం కూడా కలిసొచ్చింది. జగన్ సీఎం అయ్యారు.
అయితే కోడికత్తితో హత్య కు ప్రయత్నించారా? లేదా? అనేది మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. పాపం.. ఆకేసులో నిందితుడైన శీను అనే కుర్రాడు ఇప్పటిదాకా జైల్లోనే మగ్గుతున్నాడు. అతనికి బెయిలు కూడా దొరకడం లేదు. జగన్ మీద జనంలో సానుభూతి కోసం, ఆయనను సీఎం చేయడం కోసమే తాను ఈ పనిచేశానని శీను పలుమార్లు ప్రకటించినా దిక్కులేదు. జగన్ అభిమానిగా తన గ్రామంలో ఫ్లెక్సి పోస్టర్లు కూడా వేసుకున్న శీను.. ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయాడు.
జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే అని కోర్టు అంటుండగా.. జగన్ అందుకు ఏమాత్రం సహకరించడం లేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ కోర్టుకు వెళ్లడం అనేది ఆయన ఎందుకు అవమానంగా భావిస్తున్నారో తెలియదు. అక్రమార్జనల వంటి సీబీఐ కేసుల విషయంలో మినహాయింపు తీసుకున్నా సరే.. అది అవమానం గనుక కోర్టు విచారణ తప్పించుకన్నారని అనుకోవచ్చు. కానీ, కోడికత్తి కేసులో ఆయన కేవలం సాక్షి. ఒక నిందితుడు నేరం చేశాడో లేదో తేల్చడానికి స్వయంగా దాడికి గురైన వ్యక్తి, ప్రత్యక్షసాక్షి సహకరించకపోతే ఎలాగ? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
కోడి కత్తి కేసు ఎన్నికల సమయంలో జగన్ కు లాభించిన మాట నిజం. కానీ ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్లడానిక భయపడడం గమనిస్తోంటే.. ఏదో తెలియని రహస్యం ఇందులో ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. కోడికత్తి కేసు జగన్ ను పీడకలలాగా వేధిస్తున్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు. నిందితుడు శీను తరఫు న్యాయవాదులు మాత్రం జగన్ కోర్టుకు రాక తప్పదని, ఆయన కోరుతున్నట్టుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా సాక్ష్యం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.