తెలుగులో ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ వేణు ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో తమ్ముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీరామ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
యాక్షన్ డ్రామాగా రాబోతున్న తమ్ముడు సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు స్పెషల్ గా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేయిస్తున్నట్టు టీం తెలిపింది. ఈ సినిమా కోసం తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కోటి రూపాయలతో నిర్మించిన స్పెషల్ సెట్ లో నితిన్ కాకుండా మిగతా ఆర్టిస్టులతో 7 రోజుల పాటు ఫైట్ సీక్వెన్సులు తెరకెక్కించబోతున్నారని సమాచారం.
ఈ ఫైట్ సీక్వెన్స్ ను కేజీఎఫ్ 1, కాంతార చిత్రాల ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ రూపొందిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చింది. తమ్ముడు కథలో హీరోతో పాటు మిగతా నటులకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. నితిన్ తో పాటు ముఖ్య పాత్రలపై ఇప్పటికే 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ యాక్షన్ షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీ లో చేశారు..
అంతకుముందు మారేడుమిల్లిలో ఒక యాక్షన్ షెడ్యూల్ జరిగిందని, ఈ మూడు యాక్షన్ సీక్వెన్సులు తమ్ముడు సినిమాలో హైలైట్ కాబోతున్నాయని అంటున్నారు.