రెడ్డి కార్పొరేషన్ కేసీఆర్ ప్రకటిస్తారా?

Sunday, January 19, 2025

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తలపడుతున్న పార్టీలు ఒకరిని మించి మరొకరు ప్రజలను ఆకట్టుకోవడానికి వారి వారి ప్రయత్నాలలో ఉన్నారు.  వార్తలను గమనిస్తుంటే.. ఒక కుటుంబంలో ఆరుకు మించి ఓట్లు ఉన్నట్లయితే,  ఆ కుటుంబాన్ని పార్టీ నాయకులు ప్రత్యేకంగా కలిసి వారిని ప్రసన్నం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారని కూడా తెలుస్తోంది.  అలాంటిది ఒక సామాజిక వర్గం మొత్తం ఆదరణ సంపాదించడానికి..  ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయకుండా  ఎందుకు ఉంటారు?  ఎవరి నుంచి ఎలాంటి విజ్ఞప్తి వచ్చినా సరే,  ఏ కులం మదిలో ఎలాంటి కోరిక ఉన్నదని సమాచారం తెలిసినా సరే..  దానికి సంబంధించి ఒక ప్రకటన చేసేసి..  ఆ కులాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  తాజా పరిణామాలనుగమనిస్తుంటే  రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కెసిఆర్ హామీ ఇవ్వవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 రెడ్డి కులంలోని పేదలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం,  ప్రోత్సాహం అందించడానికి రెడ్డి కార్పొరేషన్ ఉండాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది.  ఈ విషయంపై రెడ్డి జాగృతి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకున్నారు.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరచాలని వారు కోరారు.  5 వేల కోట్ల రూపాయల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కావాలనేది వారి అభిలాష.  ఈ మేరకు గాంధీభవన్ కు వెళ్లిన రెడ్డి వర్గం నాయకులు..  మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందుబాటులో లేకపోవడంతో,  కమిటీలో ఉండే హర్షవర్ధన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. 

ఈవినతి మీద  కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  ఇంకా స్పష్టత రాలేదు.   తెలంగాణ కాంగ్రెసులో  రెడ్డి వర్గం ప్రాబల్యం మరీ ఎక్కువ.   ఎమ్మెల్యే టికెట్లు కూడా రెడ్డి వర్గం నాయకులకే ఎక్కువగా కట్టబెడుతున్నారని విమర్శలు వినిపిస్తుంటాయి.  ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి పార్టీ హామీ ఇస్తే రాజకీయంగా ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్నట్లుగా పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తారని భయం వారికి ఉంది.  కేసీఆర్ కు అలాంటి ఆలోచన లేదు.

అందుచేతనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి ప్రకటన చేయవచ్చుననే భావన ప్రజల్లో కలుగుతుంది.   రెడ్డి వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తిగా పడతాయని అభిప్రాయం ప్రజల్లో ఉన్న సమయంలో..  వారి ఓట్లలో చీలిక తీసుకువచ్చి భారత రాష్ట్ర సమితి లబ్ధి పొందాలంటే కనుక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఒక బ్రహ్మాస్త్రం అవుతుందని అభిప్రాయం భారాస వర్గాలలో వినిపిస్తోంది.  తద్వారా కాంగ్రెస్ రెడ్డి వర్గానికి కూడా తలపెట్టని మేలు.. కేసీఆర్ చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles