కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని జాతీయపార్టీ గుర్తింపుతో భారాసగా మార్పు చేశారు. దేశమంతా తన రాజకీయ చతురతను ప్రదర్శించి.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉత్సాహపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటన చేసిన నాటినుంచి.. భారాస ప్రకటన, భారాస అధికారిక ఆవిర్భావం వరకు అనేక సందర్భాల్లో ఈ పార్టీ గురించి, రాబోయే రోజుల్లో విధానాలు, దేశవ్యాప్తంగా విస్తరించడం గురించి కేసీఆర్ అనేక సార్లు మాట్లాడారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా.. పొరుగున ఉన్న ఏపీలో భారాస పార్టీని ఎలా విస్తరించేదీ వివరించలేదు. అసలు ఏపీ వ్యవహారాల జోలికి వెళ్లలేదు. కర్ణాటక తమిళనాడు ఒరిస్సా నార్త్ ఇండియాలోని ఇతర ప్రాంతాల గురించి కూడా మాట్లాడారు తప్ప.. ఏపీ రాజకీయాల ఊసెత్తలేదు.
తనకు ఎంతో సన్నిహితుడు అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆయన ఎలాంటి ఆలోచనతో ఉన్నారో తెలియదు గానీ.. ఆయనను స్వాగతించడం గురించి.. ఏపీ ప్రజలు, ఏపీలోని ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. భారాస అధికారిక ఆవిర్భావం తరువాత.. విజయవాడలో పెద్దపెద్ద ఫ్లెక్సిలు వెలిశాయి. కేసీఆర్ ను ఒక రేంజిలో కీర్తిస్తున్నారు. ‘‘జయహో కేసీఆర్ అంటూ.. దేశ రాజకీయాల్లో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం.. కక్ష రాజకీయాలకు స్వస్తి’’ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి. బండి రమేష్, భవన్ కుమార్ పేర్లతో ఏర్పాటైన ఫ్లెక్సిల్లో కక్ష రాజకీయాల ప్రస్తావన తేవడం ద్వారా.. కేసీఆర్ ఫ్యాన్స్ .. సీఎం జగన్ నే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తోంటే.. ఏపీలోని ఆయన ఫ్యాన్స్ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా’ అనడం ద్వారా కేసీఆర్.. జగన్ కు వ్యతిరేకంగానే భారాసను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నట్టు అర్థమవుతోంది.
విజయవాడలోనే భారాస రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం అవుతోంది. జగన్ ఒకవైపు మూడు రాజధానులు అంటున్నప్పటికీ.. అది నెరవేరే కోరిక కాదని కేసీఆర్ నమ్ముతున్నారేమో తెలియదు గానీ.. భారాస రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో నిర్మించబోతున్నారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో రాష్ట్ర కార్యాలయం నిర్మించబోతున్నారని సమాచారం. ఈనెల 18న ఈ స్థలాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఏపీ రాజకీయాల గురించి.. తన భారాస ప్రసంగాల్లో కేసీఆర్ ప్రస్తావించలేదు. ఆయనకు లేని ధైర్యం ఆయన ఫ్యాన్స్ లో పుష్కలంగా ఉంది. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు తగిలేలా.. నినాదాలతో వారు భారాస పోస్టర్లను తయారు చేస్తున్నారు. మరి ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఎంత సీరియస్ గా దృష్టి పెడతారో చూడాలి.