తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జులు అందరూ కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండేలాగా.. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన యాక్షన్ ప్లాన్ ను తయారుచేసి వారిని వెంటపడుతున్నారు. అతి తరచుగా ప్రజల వద్దకు వెళుతూ ఉండాలనే.. వైసీపీ నాయకులకు గుండెల్లో దడగా ఉంటోంది. భయపడుతున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను నివేదిస్తున్నారని, తమను నిలదీస్తున్నారని వారి భయం. గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు వారికి చెప్పుకున్న సమస్యలకు ఇప్పటిదాకా అతీగతీ లేదు.. అప్పుడే వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని జగన్ నాయకుల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వై ఎపీ నీడ్స్ జగన్ అంటూ ఊదరగొడుతుండగా.. ఏపీకి అసలు జగన్ ఎందుకు అవసరం లేదో చెబుతూ ఏకంగా ఒక పుస్తకమే వేయొచ్చునంటూ.. తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడుతుండడం విశేషం.
అసలు రాష్ట్రానికి జగన్ అవసరం ఏం ఉన్నదో, ఎందుకున్నదో కనీసం ఒక్క మంచి కారణం చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ అధికార పార్టీ నాయకులకు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో.. రాష్ట్రానికి ఆయన ఎందుకు అవసరం లేదో తాను వంద కారణాలు చెప్పగలనని కూడా సవాలు విసురుతున్నారు. అసలు అలాంటి కారణాలతో ఒక పుస్తకమే తెస్తానని కన్నా అంటున్నారు. వైఎస్సార్ అవినీతి మీద గతంలో పుస్తకం తెచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేమాదిరిగా జగన్ వైఫల్యాలు, రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాల గురించి ఒక పుస్తకం తేవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నదా అనే అభిప్రాయం పలువరిలో కలుగుతోంది.
ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టినందుకా? లేదా, రాజధానిలేకుండా చేసినందుకా? ఇసుక లిక్కర్ వ్యాపారాలలో వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నందుకా.. అంటూ రకరకాల కారణాలను కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. 2019 నాటికి 75 శాతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం పూర్తిచేసి జగన్ చేతిలో పెడితే.. ఆ ప్రాజెక్టును కూడా పూర్తిగా సర్వనాశనం చేశారని ఆరోపిస్తున్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీ నాయకులకు చాలా కష్టంగా ఉంటోంది. వెళ్తే ప్రజల నుంచి ఎదురుదెబ్బలు, ప్రశ్నలు, నిలదీతలు. వెళ్లకపోతే అధినేత నుంచి అక్షింతలు. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైందని వారో వాపోతున్నారు.
జగన్ ఏపీకి ఎందుకు వద్దంటూ.. ఒక పుస్తకం!
Sunday, December 22, 2024