రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉపయోగపడగల ఎలాంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకునే ఉద్దేశం ఈసారి తెలుగుదేశం పార్టీకి లేదు. అందుకోసం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నeరు.. అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. బలగాలను సమీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. 2019 ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల ప్రచారంలో జూనియర్ తప్పకుండా ప్రచారంలో పాల్గొంటారని, జగన్ ప్రభుత్వ పతనానికి తన వంతు సాయం చేస్తారని పార్టీలో చర్చలు నడుస్తున్నాయి. తాజాగా నందమూరి కుటుంబానికే చెందిన మరో హీరో తారకరత్న ఏపీలో ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి అసెంబ్లీ బరిలో పోటీచేస్తానని హీరో నందమూరి తారకరత్న ప్రకటించారు. ఇప్పటినుంచే పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉంటూ మామయ్యకు అండగా పనిచేస్తానని, రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడం తన వంతు పనిచేస్తానని కూడా చెప్పారు. తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈక్రమంలో భాగంగానే.. తారకరత్న.. తెలుగుదేశం అభిమానులకు ఒక తియ్యటి కబురు అందించారు.
వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా ఆయన ప్రకటించారు. ఇది నిజంగానే తెలుగుదేశం ప్రియులకు శుభవార్త. నందమూరి తారక రామారావుకు ప్రజల్లో అనన్యమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా చురుగ్గా జూనియర్ టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుజాతి అన్న ఎన్టీఆర్ తరహాలో.. ఖాకీ డ్రస్ లో ప్రచారానికి వచ్చి.. అందరినీ ఆకట్టుకున్నారు జూ ఎన్టీఆర్. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబంతో విభేదాలు వచ్చాయని, పార్టీ నాయకత్వంలో భాగం కోరుకున్నారని అది దక్కకపోయేసరికి ప్రచారానికి దూరం ఉండిపోయారని రకరకాల కుట్ర ప్రచారాలు జరిగాయి. వాటిమీద జూనియర్ ఎప్పుడూ కూడా పల్లెత్తి మాట్లాడలేదు. అలాంటి విషపూరితమైన వక్రప్రచారాలకు సమాధానం చెప్పినా కూడా.. మరో రకంగా వక్రీకరించి ప్రచారం చేస్తారనే సంగతి ఆయనకు తెలుసు. అందుకే మౌనంగానే ఉండిపోయారు.
ఈ ఎన్నికల్లో పరిస్థితి అలా కాదు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే సర్వశక్తులను మోహరిస్తోంది. జూ.ఎన్టీఆర్ ను కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దించుతోంది. తారకరత్న మాటలతో ఆ విషయం కన్ఫర్మ్ అయినట్లేనని తెలుగుదేశం వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.