చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా, అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అభిమానులు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆందోళనలు మరింత ఘాటెక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనల్లోకి పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా అడుగుపెట్టబోతోంది. ఎలాంటి పొరపొచ్చాలకు అవకాశం లేకుండా, సమన్వయంతో ఉమ్మడి కార్యచరణతో పోరాటాల్లో తెలుగుదేశానికి మద్దతివ్వావలని.. స్వయంగా జనసేనలోని కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఏపీలోని పార్టీ కీలక నాయకులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. తెలుగుదేశంతో కలసి పనిచేయాల్సిన విషయంతో పాటు, పవన్ అక్టోబరు 1న ప్రారంభించనున్న వారాహి విజయయాత్రను సక్సెస్ చేయడం గురించి కూడా ఆయన వారితో చర్చించారు.
తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ .. కార్యకర్తలకు ధ్రువీకరించారు. తేడాలు రాకుండా ఆందోళనల్లో పాల్గొనాలని, త్వరలోనే రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణ కూడా సిద్ధం అవుతున్నదని మనోహర్ చెప్పారు. తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్లాలనే విషయంలో.. పార్టీ నాయకులు అందరినుంచి ముక్తకంఠంతో మద్దతు ఎదురైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నదని అంటున్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రెండు పార్టీలు కలిసి పోటీచేయాలనే పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ఆమోదిస్తూ పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
నిజంగా, తెలుగుదేశం నాయకులు ఇది శుభవార్త. ప్రజాందోళనల్లోకి చురుగ్గా వెళ్లాల్సిందిగా, నాదెండ్ల మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులకు సందేశం ఇచ్చేశారు. అక్టోబరు 1వ తేదీనుంచి పవన్ కల్యాణ్ మళ్లీ తన వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈసారి యాత్ర మొత్తం అచ్చంగా.. చంద్రబాబునాయుడు అరెస్టు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న అరాచకధోరణుల మీద దండయాత్రగానే ఉండబోతుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తుందని రెండు పార్టీల కార్యకర్తలు అనుకుంటున్నారు.