వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఒక పోరాటంలో విజయం సాధించారు. దాదాపు ఏడాదికి పైగా న్యాయపోరాటం సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో విజయం దక్కింది. కానీ దక్కినది శాశ్వత విజయం కాదు.. ఓడిపోయిన వారు హైకోర్టుకు వెళితే ఈ తీర్పు తారుమారు అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. టెక్నికల్ గా ఒక కేసులో విజయం సాధించిన సంతోషాన్ని జగన్ అనుభవిస్తున్నారే గానీ.. వాస్తవంలో.. వ్యక్తిగతంగా ఆయన పరువు మొత్తం మటాష్ అయిపోయిందని ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. కన్న తల్లికి కానుకగా ఇచ్చిన ఆస్తులను కూడా కక్కుర్తిగా వెనక్కు లాక్కున్న ఘనుడిగా, తల్లిమీద తనకు ప్రేమ తగ్గిపోయిందని న్యాయస్థానం సాక్షిగా అధికారిక ప్రకటన చేసిన ఆదర్శమూర్తిగా జగన్ చరిత్రలో మిగిలిపోనున్నారు.
2019 ఎన్నికల దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తల్లి వైఎస్ విజయమ్మను, చెల్లి వైఎస్ షర్మిలను తన సొంత అవసరాలకు బాగా వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో సమానంగా వారు కూడా ఆ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తమ రక్తమాంసాలు పణంగా పెట్టి కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ తన అసలుబుద్ధిని బయటపెట్టారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సిద్ధాంతం తనకు అత్యంత ఇష్టమైనదని నిరూపించారు. అధికారం పట్టిన వెంటనే.. ఆ భోగంలో భాగం ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. వారిద్దరినీ దూరం పెట్టారు ఆక్రమంలో కుటుంబంలో వివాదాలు రేగినప్పుడు.. అప్పటిదాకా ప్రారంభం కూడా కాని సరస్వతి పవర్ మరియు ఇండస్ట్రీస్ సంస్థలో షేర్లను తల్లిపేర, చెల్లి పేర గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి వారిని వదిలించుకున్నారు జగన్.
అప్పటిదాకా ఏ బహిరంగ వేదిక మీద తల్లీకొడుకు తారసపడినాకూడా.. కొడుకు నుదుట తల్లి ముద్దులుపెట్టడం తనదైన పద్ధతిలోఆశీర్వదించడం వంటివి ఉండేవి. ఆ తర్వాత అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో కూతురుకు అండగా ఉన్నారు. ఆతర్వాతి పరిస్థితుల్లో షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథిగా మారి అన్న అరాచకాల మీద దృష్టిసారించేసరికి జగన్ కు కోపం వచ్చింది.
చెల్లెకి, ఆమెకు మద్దతుగా ఉన్నందుకు తల్లికి గిఫ్టు డీడ్ ద్వారా ఇచ్చిన సరస్వతి పవర్ షేర్లు తనకు వెనక్కు ఇచ్చేయాలని, వారి మీద ప్రేమ ఉన్నప్పుడు ఇచ్చానని, ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది గనుక.. తన షేర్లు వెనక్కు ఇచ్చేయాలని జగన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి విజయం సాధించారు. వారి బదిలీచేసిన షేర్లను నిలుపుదల చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే ఈ విషయంలో విజయమ్మ, షర్మిల హైకోర్టుకు వెళ్లవచ్చునని ట్రిబ్యునల్ పేర్కొంది.
తల్లి మీద జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి విజయం సాధించి ఉండవచ్చు గాక.. కానీ, కన్న తల్లి పట్ల ఇంత అమానుషంగా, కర్కశంగా వ్యవహరించిన నాయకుడిగా ఆయనకు ప్రజల దృష్టిలో ఒకముద్ర పడింది. జగన్ కేవలం ఆస్తులకోసం కన్నతల్లి మీద కేసు నడిపిన రాజకీయనాయకుడిగా మిగిలిపోయారు. ఈ కోర్టు తీర్పు ద్వారా ఆయన ఏం సాధించారోర తెలియదు గానీ… ప్రజల దృష్టిలో ఆయన పరువు గంగలో కలిసిపోయిందని అంతా అనుకుంటున్నారు.
