ఉమ్మడి కర్నూలు జిల్లా స్థఆనిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించినప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆణిముత్యాల్లాంటి కొన్ని మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తులు హుందాగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హుందాతనం లేదని, ఆయన లేకిగా వ్యవహరిస్తున్నారని రకరకాల నిందలు వేశారు. అయితే, కరడుగట్టిన పెత్తందారీ పోకడలకు, ప్రజాస్వామ్యంలో ఫ్యూడల్ విధానాలుకు పెట్టింది పేరుగా తన పాలన కాలంలో.. మంత్రలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు హుందాతనం గురించి మాటలు చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జగన్ హుందాతనం గురించి మాట్లాడుతున్న సమయంలోనే.. ప్రజలు నైతికత ప్రమాణాల మీద కూడా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనిస్తున్నారు.
గతంలో ఏం జరిగింది? అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు భార్య గురించి వల్లభనేని వంశీ లేకిగా, నీచమైన వ్యాఖ్యలు చేస్తే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఆనందంగా ఆ వ్యాఖ్యలను చూసుకుని మురిసిపోయారు. శాసనసభలో కూడా ఆ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు.. కొడాలి నాని అంతకంటె నీచంగా ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడినప్పుడు.. సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వారించకపోగా.. ముసిముసి నవ్వులతో పండగ చేసుకున్నారు. చంద్రబాబునాయుడు భార్య గురించి తప్పుడు మాటలు తన మనుషులు మాట్లాడుతూ ఉంటే వాటిని ఆస్వాదించారు.
ఇప్పుడు ఏం జరుగుతోంది? వైఎస్ భారతి గురించి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్య పదజాలంతో వీడియో పోస్టు చేశారు. ఆనాడు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకంటె, ఇవాళ చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు చాలా చిన్నవి. అయితే.. చంద్రబాబునాయుడు ఎలా స్పందించారు? ఆయన తక్షణం కిరణ్ ను తన పార్టీనుంచి సస్పెండ్ చేశారు. అతడిమీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా.. పోలీసుల్ని పురమాయించారు. పోలీసులు అతడిమీద కేసులు నమోదు చేయడమూ.. ఆ వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని ఇబ్రహీంపట్నం వద్ద పట్టుకోవడమూ కూడా జరిగింది. ప్రస్తుతం అతనికి రిమాండు విధించారు.
ఈ రెండు ఉదాహరణలు గమనిస్తే.. ఏ నాయకుడికి నైతిక విలువలు ఉన్నాయో చాలా బాగా అర్థమవుతుంది. వైఎస్ భారతికి అవమానం జరిగినా సరే.. తన ఇంటి ఆడబిడ్డకు జరిగినట్టుగానేచంద్రబాబునాయుడు స్పందించారు. వైఎస్ భారతి మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఏ మహిళకు ఇలాంటి అవమానం జరిగినా సరే.. తమ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందనే సంకేతాలు ఆయన పంపారు. అదే జగన్మోహన్ రెడ్డి అపట్లో తన సంకుచిత బుద్ధులను మాత్రమే చాటుకున్నారు. అందుకే.. నైతిక విలువల్లో చంద్రబాబుతో వెయ్యోవంతుకు కూడా తూగలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో హుందాతనం గురించి మాట్లాడడం చవకబారుతనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.