పరామర్శల యాత్రలు అనేవి జగన్ కు అలవాటు. ఓదార్పు యాత్రలతోనే ఆయన రాజకీయం ప్రారంభం అయింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రస్థానం మొత్తం చావుల పరామర్శలు, నేరాలుచేసి అరెస్టు అయి జైల్లో గడుపుతున్న వారి పరామర్శలు అన్నట్టుగానే నడుస్తున్నది తప్ప.. మరొకటి కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోసం మళ్లీ ములాఖత్ కోసం జైలుకు వెళతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ దందాలకు అరాచకాలకు పేరు మోసిన వ్యక్తిగా ముద్ర పడ్డారు. గతంలో దొమ్మీ జరుగుతున్న సమయంలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైన కేసులో ఆయన కీలక నిందితుడు. ఆ కేసులో సుదీర్ఘకాలం రిమాండులో ఉండి, ప్రస్తుతం బెయిలుపై బయటకు వచ్చారు. కనీసం బెయిలుపై ఉన్న రోజుల్లో అయిన గుట్టుచప్పుడు కాకుండా ఆయన ఉండిపోతే సరిపోయేది. అలాంటిది రెచ్చిపోయి మళ్లీ తన రౌడీయిజాన్ని నడిరోడ్డుమీద ప్రదర్శించడం మాత్రమే కాదు.. వ్యక్తిని నిర్బంధించి దాష్టీకం చేయడంతో ఆయన మీద పోలీసు కేసు నమోదు అయింది. మళ్లీ రిమాండుకు వెళ్లారు.
రాజు అనే తెలుగుదేశం కార్యకర్త ఉద్దండరాయని పాలెంలో రోడ్డు మీద ఉండగా వేగంగా వెళుతున్న మాజీ ఎంపీ కారు అతడిని ఢీకొంది. స్లోగా వెళ్లి ఉండాలి కదా అని అతను అంటుండగానే కారులోంచి మాజీ ఎంపీ సురేష్, అతని సోదరుడు వెంకట్ కిందికి దిగి ఆ రాజును చితక్కొట్టారు. సురేష్ అనుచరులు కూడా నిమిషాల వ్యవధిలో అక్కడకు మోటారు బైకులపై వచ్చి ఆ రాజుపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. ఆ రాజును నిర్బంధించి సురేష్ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ నందిగం సురేష్ భార్య బేబి కూడా అతడిని చెప్పుతో కొట్టారు. అంతేకాకుండా.. అనుచరులంతా కర్రలు, రాళ్లతో దాడిచేశారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. యితడిని అడ్డుతొలగించుకోవాలని, చంపి నదిలో పారేద్దాం అని వారు మాట్లాడుకుంటున్న మాటలు విని అతను అక్కడినుంచి పారిపోయి మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేయగా మంగళగిరి కోర్టు రిమాండుకు పంపింది.
గతంలో మరియమ్మ హత్య కేసులో రిమాండులో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ ను పరామర్శించడానికి ములాఖత్ కోసం జైలుకు వెళ్లారు. నిజానికి జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. చనిపోయిన తన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఊరడించడానికి, జైలులో ఉంటున్న తమ కార్యకర్తలను ములాఖత్ లలో పరామర్శించడానికి తప్ప మరో ప్రజాకార్యక్రమమేదీ స్వయంగా చేపట్టడం లేదు. ఇలాంటి పరామర్శల వల్ల.. రాజకీయ మైలేజీ వస్తుందనే భ్రమలో.. ప్రభుత్వం మీద నిందలు వేయవచ్చుననే ఆశతో ఆయన పావులు కదుపుతున్నారు. కాగా, నందిగం సురేష్ కోసం మరోసారి ములాఖత్ కు వెళ్లడానికి జగన్ ముహూర్తం పెట్టుకుంటున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అలా చేస్తే ఒక హత్య కేసు నిందితుడిని, రోడ్డుమీదనే బరితెగించి దాడిచేసిన కొట్టిన వ్యక్తిని సమర్థించిన నేతగా జగన్ పరువే పోతుంది కదా అని కూడా మాట్లాడుకుంటున్నారు.
