జగన్ పరువునష్టం దావా: కొరివితో తల గోక్కోవడమే!

Sunday, December 22, 2024
ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలమీద జగన్మోహన్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు. పరువునష్టం దావా ఇంకా కోర్టు దాకా వెళ్లలేదు. రెండు రోజుల కిందట నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ వారిద్దరి మీద పరువునష్టం దావా వేయబోతున్న సంగతిని ముందుగానే ప్రకటించారు. అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని.. సెకితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా వచ్చిన ఆరోపణలు, ఎఫ్బిఐ నివేదికల గురించి తప్పుడు కథనాలు ప్రచురించారనేది ఆయన ప్రధాన ఆరోపణ.

దీనికి సంబంధించి క్షమాపణ చెప్పడానికి జగన్ ఆ రెండు పత్రికలకు 48 గంటల గడువు ఇచ్చారు. గడువు దాటితే దావా వేస్తానని అన్నారు. ప్రస్తుతం పరువునష్టం దావా ఇంకా కోర్టు దాకా వెళ్లలేదు గానీ.. ఆ రెండు సంస్థలకు జగన్ లీగల్ నోటీసులు పంపారు. అయితే ఈ దావా ద్వారా జగన్మోహన్ రెడ్డి కొరివితో తల గోక్కోవడమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థల పట్ల జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన పరిపాలన కాలంలో కక్ష పూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. దాదాపుగా ప్రతి ప్రెస్ మీట్ లోనూ ‘ఆ రెండు పత్రికలు’ అంటూ వారి మీద విషం కక్కుతూ ఉండేవారు. ఆ పత్రికల్లో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వచ్చినా.. నిర్మాణాత్మక విమర్శగా భావించి పాజిటివ్ నోట్ తో తీసుకునేవారు కాదు. తన కార్యక్రమాలకు ఆ రెండు పత్రికల వారిని ఎవాయిడ్ చేయడానికి ప్రయత్నించేవారు.

రాజశేఖర రెడ్డి పాటించిన అనేక పద్ధతుల్లో చాలా వాటిని ఆయన కొడుకు జగన్ పట్టించుకోకపోయినప్పటికీ.. ఆ రెండు పత్రికల మీద ద్వేషాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. తనకు పరిపాలన అవకాశం దక్కిన సమయంలో వారిని ఎంత వేధించారో కూడా అందరికీ తెలుసు. రామోజీరావును అరెస్టు చేయించాలని తప్పుడు కేసులు నడిపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నిజాలు రాస్తున్నందుకు ఆ రెండు సంస్థలకు లీగల్ నోటీసులు పంపడం మరో ఎత్తు.

అయితే ఇలాంటి పరువు నష్టం దావా వేయడం వలన.. తన లంచాల కేసుల వ్యవహారం ఎప్పటికీ వార్తల్లో సజీవంగా ఉండే పరిస్థితిని జగన్ తయారుచేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. దావా కోర్టు దాకా వెళితే.. వాయిదా ఉన్న ప్రతిసారీ.. ఎఫ్బిఐ కేసు, లంచాలు గొడవ మొత్తం ప్రస్తావిస్తూ మొత్తం కథనాలు మళ్లీ మళ్లీ రాసి.. ఈ కేసులో ఇవాళ పరువునష్టం కేసు వాయిదా ఉంది అని ఆ పత్రికలు రాయడం ప్రారంభిస్తాయి.

ఇప్పుడున్న వాతావరణంలో అయితే.. జగన్ లంచాల వ్యవహారం ఓ రెండు మూడు నెలల్లో సద్దుమణిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే పరువునష్టం దావా వేయడం వల్ల రెండుమూడేళ్లు కాదు కదా.. ఓ దశాబ్దం పాటు అయినా.. కేసు తేలే వరకు ఆయన అవినీతి బాగోతం ప్రజల్లో నిత్యం చర్చకు వస్తూనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles