పెద్దిరెడ్డి పరువు తీసేందుకు జగన్ కంకణం!

Wednesday, January 22, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి బలమైన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో రెండు సీట్లు పెద్దిరెడ్డి పుణ్యమే. ఆయన పుంగనూరు నుంచి, ఆయన తమ్ముడు ద్వారకనాధరెడ్డి తంబళ్లపల్లెనుంచి గెలిచారు. పెద్దిరెడ్డి గనుక లేకపోతే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుక్షవరం అయి ఉండేది. పైగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఆయన కొడుకు మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కూడా గెలిచారు.

ఆ రకంగా వైసీపీకి ఈ ఎన్నికల్లో ఈ మాత్రం పరువు దక్కిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాటా చాలా ఉంది. అలాంటి పెద్దిరెడ్డి పరువు తీయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రాతినిధ్యం పొందేంత బలం లేకపోయినప్పటికీ.. పీఏసీ ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి తో నామినేషన్ వేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి రెడీ అయ్యారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనేది ఏ ప్రభుత్వంలో అయినా సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి దక్కే ఒక కీలకమైన పదవి. పీఏసీలో 12 మంది సభ్యులుంటారు. 9 మంది అసెంబ్లీనుంచి, ముగ్గురు కౌన్సిల్ నుంచి ఉంటారు. అసెంబ్లీనుంచి సభ్యుడిగా ఉండే ప్రతిపక్ష ఎమ్మెల్యేకు సాంప్రదాయంగా పీఏసీ ఛైర్మన్ పదవి కట్టబెడతారు. అయితే.. పీఏసీలో సభ్యుడిగా ఉండాలంటే.. కనీసం పది శాతం ఎమ్మెల్యేల బలం, అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

గతంలో జగన్ పాలన హయాంలో తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడం వలన.. ఒకే మెంబరుకు అవకాశం వచ్చింది. పయ్యావుల కేశవ్ సభ్యుడు అయ్యారు. సాంప్రదాయం ప్రకారం ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఈ ఏడాది వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. సభ్యుడిగా అవకాశమే దక్కదు. అలాంటి పీఏసీ ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించారు.

ఈ ప్రహసనం కారణంగా పెద్దిరెడ్ది పరువు పోవడం తప్ప దక్కేదేం లేదని పలువురు అనుకుంటున్నారు.
పార్టీ అంతర్గత పదవుల కేటాయింపులోనే పెద్దిరెడ్డికి అవమానం జరిగింది. రీజినల్ కోఆర్డినేటరుగా ఆయనకు తొలుత కొన్ని జిల్లాలు కేటాయించి.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒత్తిడితో ఆయనను తప్పించి.. వేరే జిల్లాలు కేటాయించి డమ్మీని చేశారనే ప్రచారం పార్టీలో ఉంది. ఇప్పుడు మరోసారి పెద్దిరెడ్డి పరువు తీయడానికే జగన్మోహన్ రెడ్డి పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయించారని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles