జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లో ప్రసంగించేప్పుడు.. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివినంతవరకు ఓకే, నష్టమేం లేదు! ఆవేశ పడిపోయి స్క్రిప్ట్ చేతిలో లేకుండా మాట్లాడితే పార్టీకి ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తారని సీనియర్లు ఉడికిపోతున్నారు. ఇన్నాళ్లుగా రాజకీయాలలో ఉన్న వ్యక్తి, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, కనీస రాజకీయ జ్ఞానం అలవరచుకోకపోతే ఎలా అని వైసిపి సీనియర్లు తమలో తాము తర్కించుకుంటున్నట్టుగా విశ్వసినీయంగా తెలుస్తోంది. ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినంత వరకు ఓకే కానీ, ఆ సందర్భంగా ఆయన ఎక్స్ ట్రాలు మాట్లాడడం పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతోంది. దేశంలోని అన్ని పార్టీలను పిలుస్తాం అని, ఏపీలో ఆటవిక పాలనను దేశం మొత్తానికి తెలియజెబుతాం అని జగన్ ప్రకటించడం కొంపముంచేలా ఉందని అంటున్నారు.
జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. రాబోయే అయిదేళ్లపాటు కూడా రాజ్యసభలో మోడీ సర్కారు బిల్లులకు బేషరత్తు మద్దతు ఇస్తానని లోలోపల హామీ ఇచ్చినా సరే.. ఎన్డీయే కూటమి పార్టీలు ఆ ధర్నావైపు రావు. ఆయన తన పోరాటం చంద్రబాబు మీద అనుకోవచ్చు గానీ.. ఆ చంద్రబాబు.. కేంద్రంలోని కూటమిలో భాగం అని మర్చిపోతున్నారు. ఇక పోతే.. ఇండియా కూటమిలో ఎవరు ఆయనకు మద్దతు ఇస్తారనేది ప్రశ్న. వామపక్షాలు చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పోరాటానికి మద్దతివ్వవు. అలాగే కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన శత్రువుగా జగన్ నే చూస్తున్నది గనుక వారు రారు. ఇండియా కూటమిలో మిగిలిన కీలక పార్టీలో తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, జనతాదళ్, డీఎంకే, ఆప్ వంటివి ఉన్నాయి. కానీ ఆ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా అంత ఆషామాషీగా మద్దతివ్వరు. క్షేత్రస్థాయి వాస్తవాల్ని స్వయంగా తెలుసుకోకుండా, జగన్ చెప్పే అబద్దాలను నమ్మి నిర్ణయాలు తీసుకోరు.
ఇక స్టాలిన్ తో గానీ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ ఎవ్వరూ కూడా తేలిగ్గా నిర్ణయం తీసుకోరు. వారందరితో చంద్రబాబుకే మెరుగైన సంబంధాలు ఉన్నాయి. ఆయన పాలన గురించి అవాకులు చెవాకులు పేలుతానంటే వారు నమ్మరు. ఇక తాము తల పెట్టిన ఢిల్లీ ధర్నాకు దేశంలోని ఇతర పార్టీలు ఎవరు వస్తారనేదే.. సీనియర్లకు భయంగా ఉంది. ఎవరూ రాకపోతే పరువు పూర్తిగా మంటగలిసిపోతుందని ఇంకో భయం. జగన్ ఆ మాట చెప్పకుండా ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.
జగన్ ప్రకటనతో వైసీపీ సీనియర్లకు తలనొప్పి!
Tuesday, January 21, 2025