‘మాది రాజకీయాలకు అతీతమైన బంధం’ అని.. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వేదికమీదినుంచే ప్రకటించారు. మరి ఆ బంధం వారి వారి వ్యక్తిగత అవసరాలు తీరడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి మాత్రమేనా..? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు ఏ కొంచెమైనా ఉపయోగపడేది ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఉదయిస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై.. కేంద్రం ఎలాంటి మొహమాటం లేకుండా.. పార్లమెంటు సాక్షిగా తెగేసి చెప్పేసిన తర్వాత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు ఇప్పటికైనా తెరచుకుంటాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది సంజీవని అనేది అందరూ ఒప్పుకునే సంగతి. వైఎస్ జగన్ కు కూడా ఆ సంగతి చాలా బాగా తెలుసు. అందుకే గత ప్రభుత్వ హయాంలో.. ప్రత్యేకహోదా కోసం మేం త్యాగం చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు. తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించారు. చాలా జాగ్రత్తగా ఉప ఎన్నిక వచ్చేంత దూరం లేకుండా రాజీనామా చేయించారు. అలా ఒకడ్రామాను రక్తి కట్టించారు. ఆ తరువాత.. 2019 ఎన్నికల్లో అధికారం ఆయన చేతికే వచ్చింది. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే చిటికెలో ప్రత్యేకహోదా తీసుకువస్తానని ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో.. అంతకంటె ఎక్కువ సంఖ్యలోనే ఎంపీలున్నారు. అయినా ఇప్పటిదాకా హోదా దిశగా ఏం సాధించగలిగారు?
ఇన్నాళ్లూ మాయమాటలు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదా గురించి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దనే అర్థం వచ్చే మాదిరిగా తెగేసి చెప్పిన తర్వాత.. ఆయన ఏం చేయబోతున్నారు. జగన్ ఇన్నాళ్లూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. కేంద్రంలో ఏ పెద్దలను కలిసాన.. బయటకు వచ్చాక.. ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరాం.. అనే డైలాగు వల్లించేవారు. అవన్నీ ఉత్తి మాటలే అని తేలిపోయింది. ప్రత్యేకహోదా అనేది ఢిల్లీలో ప్రెస్ మీట్ లు పెట్టడానికి, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడానికి ఒక ట్రంపు కార్డు లాగా తయారైంది. ప్రతిసారీ ఆ డైలాగు వాడి ప్రజల్ని బోల్తా కొట్టిస్తుంటారు.
ఇవాళ ‘ఇక హోదా ఇవ్వం’ అని కేంద్రం చెప్పింది. ఇకనైనా ఆయన కళ్లు తెరచుకుంటాయా? ప్రజల్ని మభ్యపెట్టడాన్ని ఆయన మానుకుంటారా? చీటికి మాటికి తాను మడమ తిప్పను, మాట తప్పను అని డప్పు కొట్టుకునే ముఖ్యమంత్రి చిల్లర మల్లర విషయాల్లో కాదు.. ఇలాంటి సీరియస్ విషయంలో ఆ వైఖరిని నిరూపించుకోవాలి. ప్రత్యేకహోదా రాదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో.. మళ్లీ తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి.. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవేమీ చేయలేకపోతే.. ప్రత్యేకహోదా అనే అందమైన పదంతో.. ప్రజల్ని మోసం చేసే ఆలోచలను ఇకనైనా మానుకోవాలి.. అని ప్రజలు కోరుకుంటున్నారు.
జగనన్న కళ్లు ఇప్పుడైనా తెరచుకుంటాయా?
Friday, January 24, 2025