జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి అల్లర్లు ఘర్షణలు, చెదురు మదురు అవాంఛనీయ సంఘటనల గురించి నిత్యం తనకు తోచినెదెల్లా వండి వారుస్తుంటారు. నిజానికి రెండు పార్టీల మధ్య తగాదా జరిగినా సరే, అధికారపక్షం మీద చేసిన దాడి లాగా అభివర్ణించి ప్రజల జాలి పొందడానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపతి పరిపాలన విధించాలనే డిమాండ్తో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో మాత్రం ఒక నిజం చెప్పారు. తాను నిజం చెబుతున్నట్లుగా ఆయన గ్రహించారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం వాస్తవం అనేది లోతుగా గమనిస్తేనే అర్థం అవుతుంది.
జగన్ ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్ని పాత విషయాలే చెప్పుకొచ్చారు. తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని.. ఇలా రకరకాల పాత మాటలను మళ్లీ వల్లె వేశారు. అయితే ఆయన చెప్పిన ఒకే ఒక్క నిజం ఏమిటంటే ‘‘మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదు’’ అని అన్నారు. ఈ మాట నిజం! ఆయన గాని, ఆయన ప్రభుత్వం గానీ ప్రతీ కార్య చర్యలను ప్రోత్సహించలేదు.
ఇది నిజం ఎలాగంటే.. అదివరకటి ప్రభుత్వం వీరి మీద దాడులు చేసి ఉంటే తిరిగి వీరు గద్దె మీదకు వచ్చిన తర్వాత వారి మీదకు ఉసిగొల్పి ఉంటే దానిని ప్రతీకార చర్య అంటారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం చాలా సాత్వికంగానే సాగిపోయింది. వారు చేసిన దుడుకు చర్యలు లేవు. కాబట్టి ప్రతీకారం అనే మాటకు అర్థమే లేదు.
జగన్ తన పాలన హయాంలో చేసినవి ప్రతీకార దాడులు కానే కాదు. కొత్త దాడులు! ప్రత్యర్థులను అంతమొందించాలని కక్షతో సాగించిన దాడులు. ఇప్పుడు తెలుగుదేశం వారు ఏదైనా తిరుగు జవాబు చెబితే కనుక వాటిని మాత్రమే ప్రతీకార దాడి అనాలి. అంతే తప్ప గత ఐదేళ్లలో జగన్ చేసినవి కొత్త దాడులే గాని ప్రతీ కార్య చర్యలు కానే కాదు అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.