ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండే వ్యక్తులు తమ రాజకీయ అభిమాన దురభిమానాలను హద్దులలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తమ విధి నిర్వహణకు అవి అడ్డుపడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాకాకుండా హద్దులు దాటిన ప్రేమను, లెక్కలేనంత ద్వేషాన్ని బహిరంగంగా చూపించాలని ప్రయత్నిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ క్రమంలోనే సహకార శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన పీవీవీహెచ్ రవిశంకర్ తాజాగా సస్పెన్షన్ కు గురయ్యారు. జగన్ పట్ల ఉండే వీరభక్తి మాత్రమే కాదు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల పట్ల ఉండే ద్వేషాన్ని కూడా దాచుకోలేకపోవడమే ఉద్యోగానికి ఎసరు తెచ్చింది.
కొవ్వూరు సబ్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రవిశంకర్ గత ఏడాది జూన్ లో సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ సబ్ డివిజన్ కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరకుండా ఆయన సెలవు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి భక్తుడు అయిన రవిశంకర్ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మీద అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయన మీద కమిషనర్ కార్యాలయానికి, మంత్రి అచ్చం నాయుడుకు ఫిర్యాదులు అందాయి.
కొవ్వూరులో పనిచేస్తున్న రోజుల్లో పలు సొసైటీలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కూడా రవిశంకర్ మీద ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ బాగోతాలన్నీ ఇప్పుడు బయటకు రావడంతో ఆయన మీద సస్పెన్షన్ వేటు పడింది. జగన్ వీరభక్తికి తోడు, సీఎం డిప్యూటీ సీఎం మీద విషం కట్టడం ఆయన ఉద్యోగానికి ముప్పుగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు.