బైజూస్ ను భుజాన మోస్తున్నారు ఎందుకో?

Wednesday, January 22, 2025

బైజూస్ సంస్థతో ఏపీ ప్రభుత్వం అతి పెద్ద డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ల పిల్లలకు బైజూస్ వారే ఆన్ లైన్ లో పాఠాలు చెప్పేస్తారు. అంటే తమ పాఠాలను వీడియోలుగా పంపేస్తారు. బైజూస్ రంగప్రవేశం చేయడం వలన ఏపీలో విద్యార్థుల జీవితాలు సమూలంగా బాగుపడిపోతాయని, ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజినీర్లు అయిపోతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే బైజూస్ తో చేసుకున్న భారీ ఒప్పందానికి ఎన్ని వందల కోట్ల ముడుపు వారికి ముట్టజెప్పారో మాత్రం వెల్లడించలేదు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంతో సుశిక్షితులైన.. పిల్లల సైకాలజీ తో సహా సబ్జెక్టులను కూడా పద్ధతిగా చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల టీచర్ల కంటె.. ఎక్కడా గతిలేని వారితో కూడా పాఠాలు చెప్పింది.. మాయచేసి వడ్డించే బైజూస్ వంటి సంస్థలు ఎలా పోటీపడగలవు అనే చర్చ ఒప్పందం జరిగిన నాడే తెరమీదకు వచ్చింది. అయితే సర్కారు బైజూస్ ను ఎందుకు భుజానికెత్తుకున్నదో.. ఎవ్వరికీ అర్థం కాలేదు. రాష్ట్రానికి ఏమాత్రం అవసరంలేకపోయినా, ఏ ఒక్కరికీ అదనపు ప్రయోజనం లేకపోయినా.. అమూల్ డైరీని తీసుకువచ్చి.. ప్రభుత్వం వారికి ఎదురు డబ్బులిస్తూ పాడిరైతుల మీద రుద్దడానికి ఏ రకంగా ప్రయత్నించారో అదే తీరుగా బైజూస్ ను కూడా విద్యార్థులపై రుద్దుతున్నారు. నిజానికి బైజూస్ డీల్ అనేది ఉపాధ్యాయ లోకానికి తీరని అవమానం, వారిని ఎందుకూ పనికిరాని వారిగా గుర్తించడం అనే కోపం వారిలో ఉంది. అసలే ప్రభుత్వ పాఠశాలల టీచర్లను.. ప్రభుత్వం వేధిస్తున్నదనే అభిప్రాయాలు వారికి ఉన్నాయి. వారి జీవితం మొత్తం ఆన్ లైన్ ఎటెండెన్స్, ఆన్ లైన్ ప్రోగ్రెస్ సబ్మిషన్ లాంటి వాటికే సరిపోతోందని, ఇక పిల్లలకు పాఠాలు చెప్పడానికే టైం ఉండడం లేదని వారంటున్నారు. అలాగే, ఎంత చెడ్డా.. టీచరు నేరుగా పిల్లవాడికి పాఠం చెప్తే బుర్రకెక్కినంతగా ఆన్ లైన్ పాఠాలు ఎక్కవు. ఆ సంగతి అందరికీ తెలిసిందే అయినా.. అసలు టీచర్లను చదువు చెప్పే ప్రక్రియకే దూరం చేసేస్తూ.. బైజూస్ పాఠాలను రుద్దడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. బైజూస్ వారి యాప్ లో పిల్లల తల్లిదండ్రుల ఫోను నెంబర్లు ఎంటర్ చేయలేదని.. టీచర్లకు షోకాజు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు వివాదం అవుతోంది. ఇదంతా కూడా ఉపాధ్యాయ లోకానికి అవమానమే. నెమ్మదిగా టీచర్ల పోస్టుల్లోనూ కోతపెడతారనే భయం పలువురిలో కలుగుతోంది. టీచర్లను ఇప్పటికే క్లర్కుల్లాగా మార్చేస్తున్నారని, నెమ్మదిగా ఎటెండర్లలాగా కూడా మార్చేస్తారని.. వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles