జగన్ స్టయిల్ : నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

Tuesday, December 9, 2025

2024 ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ తన పార్టీ ప్రచార బాధ్యతలను మొత్తం తానొక్కడే మోశారు. రాష్ట్రమంతా తానొక్కడే సుడిగాలి పర్యటనలు తిరుగుతూ.. దాదాపుగా అందరు ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి బహిరంగ సభల్లో ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ప్రచారం కోసం, తన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు చెప్పడం కోసం రెండంటే రెండు పదాలను బాగా కంఠతా పట్టి నేర్చుకున్నారు. ఆ పదాలు ఏంటంటే.. ‘మంచివాడు.. సౌమ్యుడు..’ అనేవి! ఏ ఊర్లో సభ జరిగినా సరే.. చంద్రబాబును అదేపనిగా తిట్టడం.. అంతా ముగిసిపోయిన తర్వాత ఒక్కొక్క అభ్యర్థిని తన పక్కకు పిలవడం పేరు చెప్పడం.. ‘మంచివాడు సౌమ్యుడు’ కాబట్టి ఓట్లు వేసి గెలిపించండి అని అనడం ఆయనకు అలవాటు అయిపోయింది.

అలాంటి సభలలో రౌడీలుగా, గూండాలుగా పేరుమోసిన.. ప్రజల్లో తిరుగులేని కీర్తిప్రతిష్ఠలు గుర్తింపు ఉన్న అభ్యర్థులను పరిచయం చేసినప్పుడు కూడా జగన్ ఇదే పదాలను వాడారు. అలాంటి సందర్భాల్లో సభలో ఉండే జనం మొత్తం గొల్లుమని నవ్వడం ప్రతిచోటా జరిగింది. ఇలా తన మాటలు ప్రజల దృష్టిలో పరిహాసప్రాయం అయిపోయిన సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుర్తున్నదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన నెల్లూరు పర్యటన ద్వారా మరోసారి నవ్వులపాలు కావడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నెల్లూరులో నవ్వులపాలు 1 :
ఒక పార్టీకి అధినేత, కేసుల్లో అరెస్టు అయిన మరో నాయకుడిని పరామర్శించడానికి ములాఖత్ కు వెళుతున్నాడంటే.. ఆ నాయకుడు సచ్ఛీలుడనే అభిప్రాయం ప్రజల్లో కొంతమందికైనా ఉండాలి. అతని మీద పెట్టిన కేసులు కేవలం కక్షపూరితం అని కొంతమంది అయినా నమ్మాలి. లేకపోతే ఎన్నికల ప్రచారంలో మాదిరిగానే జనం నవ్వుతారు. రేపు జగన్ కు ఎదురుకాబోయే పరిస్థితి అదే. ఆ సంకేతాలు బుధవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటల్లోనే కనిపించాయి. జగన్ వల్ల అరెస్టు అయి జైళ్లలో ఉన్న నాయకులు ఎంతో మంది ఉండగా.. నెల్లూరుకు మాత్రం వస్తున్నారే.. కాకాణి అంతమంచివాడా అని సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. జగన్ కారణంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా ఎంతోమంది జైళ్లలో ఉన్నారని ఆయన అంటున్నారు. కాకాణి మాత్రం అంతమంచివాడా? అని ప్రజలు కూడా అడిగితే జగన్ వద్ద సమాధానం ఉందా? ఆయన చెక్ చేసుకోవాలి.

నెల్లూరులో నవ్వులపాలు 2:
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. నీచమైన బూతులు తిట్టిన వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పైగా వేమిరెడ్డి కుటుంబానికి నెల్లూరులో జిల్లా వ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. వారి స్వచ్ఛంద సేవను రుచిచూడని వారు జిల్లాలోనే ఉండరు. అలాంటి ప్రశాంతి ని తిట్టిన దుర్మార్గుడు ప్రసన్న అనే అభిప్రాయమే ప్రజల్లో సర్వత్రా ఉంది. జగన్ తగుదునమ్మా అని ప్రసన్నకుమార్ రెడ్డికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా పరామర్శకోసం ఏకంగా ఆయన ఇంటికి వెళుతున్నారు. నెల్లూరు జనం ఏమనుకుంటారో జగన్ కు పట్టింపులేదా? ఇలాంటి నీచుడికి మద్దతివ్వడానికి వస్తున్నాడే జగన్ కు అసలు బుర్ర పనిచేస్తోందా? లేదా? అని ప్రజలు కోపగించుకునే ప్రమాదం ఉంది.

అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ప్రజలు ఏమనుకుంటే నాకేంటి? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! అనే సామెత తరహాలో.. నెల్లూరులో అసంబద్ధ యాత్ర నిర్వహిస్తూ తన పరువు తానే తీసుకుంటున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles