అక్టోబరు నాటికే వచ్చేయాలని అనుకున్నానని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన డిసెంబరు నాటికి తన నివాసం విశాఖ పట్నానికి మార్చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అదేమిటి.. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించడానికి వీల్లేదని, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని, హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పింది కదా.. ఆయన మాత్రం.. అలా ఎలా మారిపోతారబ్బా అనే అనుమానం ఎవరికైనా కలగవచ్చు. కానీ.. కోర్టు తీర్పును తమకు నచ్చినట్టుగా అన్వయించుకునే తెలివితేటలతో వచ్చిన సలహాల వల్లనే ముఖ్యమంత్రి విశాఖకు తన నివాసం మారుస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి హైకోర్టు రాజధాని తరలింపును ఆపివేస్తూ చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాంతో సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల బిల్లులను కూడా వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కారు మడమ తిప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లింది. సుప్రీం ఈ వ్యవహారాన్ని ఇంకా తేల్చలేదు. డిసెంబరులో వాయిదా ఉంది. డిసెంబరులో సుప్రీం కోర్టు విశాఖకు రాజధాని తరలింపునకు అనుకూలంగా చెబుతుందా; వ్యతిరేకంగా చెబుతుందా అనేది వేరే సంగతి. కానీ ఈలోగా కార్యాలయాలను తరలిస్తే కోర్టు ధిక్కారం అవుతుంది.
కానీ జగన్ తన పంతం నెగ్గించుకోదలచుకున్నారు. అందుకే.. సాంకేతికంగా తీర్పులో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకుంటూ.. ఆయన విశాఖకు నివాసం మార్చే ప్రయత్నలో ఉన్నారు. హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని అన్నదే తప్ప.. సీఎం ఇంటిని కాదు. సీఎం క్యాంపు ఆఫీసు అని పిలవబడే తన ఇంటిని రాష్ట్రంలో ఎక్కడినుంచైనా నిర్వహించవచ్చు. ఆ వెసులుబాటు వాడుకుని జగన్ విశాఖకు వెళుతున్నారు. తను రాగానే.. తన బీభత్సమైన సెక్యూరిటీ, సీఎంఓ కీలక అధికారులందరూ తరలిరావాలి కాబట్టి.. విశాఖకు ఒక కొత్త శోభవచ్చేస్తుందని అన్నట్టుగా ఆయన సెలవిస్తున్నారు.
అంతే తప్ప.. రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు డిసెంబరులో తరలివస్తాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం లేదు. అలా చెబితే కోర్టు ధిక్కారం అవుతుందని ఆయనకు తెలిసి. కానీ ఆ కార్యాలయాలు కూడా తరలివచ్చేస్తాయనే భ్రమ విశాఖ వాసులకు కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. తద్వారా.. విశాఖ మీద తను మేగ్జిమమ్ ఫోకస్ పెడుతున్నానని చాటుకుని.. ఉత్తరాంధ్రలో పార్టీకి మైలేజీ తీసుకోవాలనేది గానీ, ఏది ఏమైనా తన మాట నెగ్గించుకోవడం ఒక్కటే ఆయన ప్రయారిటీ అని ప్రజలు నానా రకాలుగా అనుకుంటున్నారు.
అతి జాగ్రత్తగా మాట్లాడుతున్న జగన్!
Sunday, November 24, 2024