అజ్ఞానమూ, జగన్ ఆయనను కాపాడుతుంటారు!

Thursday, January 23, 2025

ఆయన పేరు గుమ్మనూరు జయరాం. ఏపీ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు. సాధారణంగా అంత పాపులారిటీ ఉన్న మంత్రుల్లో ఒకరు కాదు. తరచుగా కాకుండా అప్పుడప్పుడూ మాత్రమే వార్తల్లోకి వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ హాట్ టాపిక్ అవుతుంటారు. వచ్చిన ప్రతిసారీ అవినీతి బాగోతాలతో మాత్రమే వార్తల్లోకి వస్తుంటారు. అవినీతి బాగోతాలు కాకుండా.. చంద్రబాబును నిందించడంలో తప్ప.. ఆయన రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన సందర్భమే లేదంటే అతిశయోక్తి కాదు. 

గుమ్మనూరు జయరామ్ అవినీతి బాగోతాలు.. రెడ్ హ్యాండెడ్ గా ఎన్ని బయటపడినప్పటికీ.. ఆయనకు కించిత్ భయం లేదు. ఎందుకంటే జగనన్న అండా దండా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. తన అనుచరుల్లో ఎవరి అవినీతినైనా మీడియా బయటపెడితే.. నాయకులు సిగ్గుపడతారు. వారి మీద చర్యలు తీసుకోవాలని అనుకుంటారు. కనీసం సంజాయిషీ అడుగుతారు. కానీ జగన్ తీరు వేరు. తన వారిలో అవినీతిని ఎదుటివారు ఎత్తిచూపితే మరింతగా వారిని కాపాడుకుంటూ ఉంటారు. అందుకే గుమ్మనూరు జయరాం అవినీతి బాగోతాలు గతంలోనూ ఎన్నో బయటపడినా.. ఆయనకేమీ కాలేదు. సగం పాలన కాలం పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కించుకున్న అత్యంత ప్రతిభావంతులైన జగన్ మంత్రులలో  ఆయన కూడా ఒకరుగా కీర్తి గడించారు. 

అలాంటి గుమ్మనూరు జయరాం ను జగన్ మాత్రమే కాదు. అజ్ఞానం కూడా కాపాడుతుంటుందని అనుకోవాల్సిందే. ఎందుకంటే. అంతటి అజ్ఞానం ఉండబట్టే ఆయన తన అవినీతి చర్యలను చాలా గట్టిగా సమర్థించుకోగలుగుతున్నారు.. అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

బెంగుళూరులోని ఇట్టినా అనే రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి భూముల కొనుగోలు వ్యవహారం గతంలోనే బయటపడింది. తాను మంత్రి అయిన ఏడాది లోపుగానే.. జయరాం సాగించిన దందాల్లో అది కూడా ఒకటి. వారినుంచి వందల ఎకరాల భూములను సొంతం చేసుకున్నారనేది ఆరోపణ. అసలు తమ కంపెనీకి సంబంధమే లేకుండా నకిలీ వ్యక్తులతో, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఇట్టినా ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాక రాద్ధాంతం అయింది. 

ఆ అక్రమ బాగోతాలకు సంబంధించి ఇప్పుడు ఐటీ శాఖ జయరాం భార్య రేణుకమ్మకు నోటీసులు ఇచ్చింది.ఆమె పేరుతో 52 లక్షల రూపాయలకు 30 ఎకరాలు కొన్నారు. ఎలాంటి ఆదాయమూ చూపించని ఆమె, ఆ డబ్బు ఎలా సమకూర్చుకున్నారని ఐటీ నోటీసు ఇచ్చింది. అక్రమాలు నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రారుకు కూడా నోటీసులు ఇచ్చారు. బినామీలను నిరోధించే చట్టం కింద ఈ నోటీసులు ఇచ్చారు. అయితే మంత్రి జయరాం మాత్రం.. తన భార్య పేరుతో కొంటే అది బినామీ కిందకు రాదని అంటున్నారు. భార్య సోదరుల పేరిటే భూములు కొన్నానని అంటున్నారు. సోదరుల పేరిట కొంటే కూడా బినామీ కిందకు రాదని ఆయన భావం కాబోలు. జగన్ అండతో పాటు, ఈ రేంజి అజ్ఞానం లేకపోతే ఇలా డబాయించి తమ బాగోతాలను సమర్థించుకోవడం కష్టం అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles