జగన్మోహన్ రెడ్డి ఎంత తలాతోకా లేకుండా మట్లాడుతుంటారో మరోసారి నిరూపణ అయింది. రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలుండగా.. కేవలం పది స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీని గెలిపించిన ప్రజల తీర్పును గౌరవించకుండా.. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ చాలా చిత్రంగా సాగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేనంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఓటమి తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో మళ్లీ తన ఎన్నికల ప్రసంగాన్నే వినిపించారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి ప్రసంగం కూడా బహుశా చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ చేసిఉండరేమో అనిపించేలా ఆయన మాట్లాడారు.
అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఒక్కటంటే ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన పాపాన పోలేదు. ప్రెస్ అంటేనే ఆయనకు చులకనగా ఉండేది. సాధారణంగా ముఖ్యమంత్రి స్పందించవలసిన తీవ్రమైన సంఘటన గానీ, రాజకీయ పరిణామం గానీ.. ఏది ఉన్నప్పటికీ ఆయన నుంచి స్పందన వచ్చేది కాదు. ముఖ్యమంత్రి స్పందించాలి కదా.. అని మీడియా మొత్తం ఎదురుచూస్తున్న సమయంలో.. తగుదునమ్మా అంటూ సజ్జల రామక్రిష్ణారెడ్డి తెరముందుకు వచ్చేవారు. సీఎం తరఫున ఆయన గళం తానే అయినట్టుగా సజ్జల మాట్లాడి వెళ్లిపోయేవారు.
అలాంటిది.. ముఖ్యమంత్రిగా అయిదేళ్లు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి.. మాజీ అయిన తర్వాత.. మంగళవారం సాయంత్రమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇంత దారుణ పరాభవాలు ఎదురయ్యే సందర్భాల్లో.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. వారిపక్షాన నిలబడతాం లాంటి ఒకటిరెండు మాటలతో పరాజితులు తమ స్పందనను పూర్తిచేస్తారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి కొన్ని నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు.
మరో రకంగా చెప్పాలంటే.. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినట్టుగా తన ప్రభుత్వపు పథకాలను, లబ్ధిదారుల సంఖ్య- వారికి పంచిపెట్టిన డబ్బుల మొత్తం వివరాలను గణాంకాలతో ఆయన వివరిస్తూ పోయారు. ఈ ఫలితాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. నా పథకాల ద్వారా డబ్బులు తీసుకున్న వాళ్ల ప్రేమ ఆత్మీయతలు ఎక్కడికి పోయాయంటూ వాపోయారు. ఇది చాలా మంది పెద్దవాళ్లున్న కూటమి.. అంటూ వెటకారంజోడించి.. కూటమి విజయాన్ని ప్రస్తావించారు. ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయో.. ఇదంతా ఎలా జరిగిందో దేవుడికి మాత్రమే తెలుసు… అనే వాక్యాల ద్వారా అక్కడికేదో తనను కుట్ర చేసి ఓడించినట్టుగా ఆయన అభివర్ణించారు. మొత్తానికి ప్రజల పక్షాన నిలబడతామని, ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్తకాదని జగన్ తన స్పందనను ముగించారు. దారుణమైన ఈ పరాభవానికి.. ప్రెస్ మీట్ లో ప్రసంగం సాగినంత సేపు జగన్ మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేకపోవడం విశేషం.
ఓడినాక కూడా ఎన్నికల ప్రసంగమేనా జగన్!
Friday, November 22, 2024