ఇన్ని డొంకతిరుగుడు మాటలు పంతం కోసమేనా?

Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన పంతం నెగ్గించుకోవడం మాత్రమే ముఖ్యమా? రాష్ట్ర ప్రభుత్వం మీద పడగల అదనపు వ్యయం,  అధికారులకు,  ప్రజలకు ఏర్పడగల ఇబ్బందులు,  కష్ట నష్టాలు లాంటివేమీ ఆయనకు అవసరం లేదా? తన మాట నెగ్గితే చాలు.. ఎవరు ఏమైపోయినా పరవాలేదు అనే ధోరణితో మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారా?  అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.  ప్రత్యేకించి విశాఖకు రాజధానిని తరలించినట్లుగా కనిపించడానికి..  దొంగ మార్గంలో తీసుకువచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులలో..  పేర్కొన్న అనేకానేక డొంక తిరుగుడు వ్యాఖ్యానాలు ఇలాంటి అనుమానాలనే కలిగిస్తున్నాయి.

 మూడు రాజధానుల ముసుగులో..  మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనే మాయమాటలతో..  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టి..  రాజధానిని విశాఖపట్నం తరలించాలనేది జగన్మోహన్ రెడ్డి సంకల్పం.  అయితే అమరావతికి అనుకూలంగా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన పాచిక పారలేదు.  రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని..  ప్రభుత్వ కార్యాలయాలు వేటిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని 2022 మార్చిలో హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది.  కొంతకాలం నిరీక్షించిన తర్వాత,  ఆ తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలో,  దాన్ని ఎలా ఎదుర్కోవాలో మల్లగుల్లాలు పడిన తర్వాత   జగన్మోహన్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.  తుది  తీర్పు సంగతి తర్వాత,  ముందు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది.  అయితే సుప్రీం..  ప్రభుత్వ వినుతులను పట్టించుకోకుండా ఈ కేసును డిసెంబర్ కు వాయిదా వేసింది. 

 ఈ నేపథ్యంలో విశాఖకు రాజధానిని తరలించడం అనేది అసాధ్యంగా మారిన వాతావరణం లో..  జగన్ సర్కారు ఒక దొంగ మార్గం కనిపెట్టింది! వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సమీక్షలు నిర్వహించడానికి,  జిల్లాలలో పర్యటిస్తూ ప్రభుత్వ నిర్ణయాల అమలును గమనించటానికి అధికారులకు,  ప్రభుత్వ కార్యాలయాలకు ట్రాన్సిట్(తాత్కాలిక) వసతి పేరుతో కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు వచ్చేసాయి. 

 కోర్టు ధిక్కరణ నేరంలో చిక్కుకోకుండా ఉండడానికి ప్రభుత్వం ఎంచుకున్న వక్రమార్గంగా ఇది కనిపిస్తోంది.  అయితే,  ఇది కేవలం సాకు అనే సంగతి అందరికీ తెలుసు.  ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది అనే పేరుతో అక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే..  ఒకటి రెండేళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో వెనుకబాటుతనం కనిపిస్తే..  మొత్తం కార్యాలయాలను రాజధానిని ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసును తిరుపతి కో,  కడప కో తరలిస్తారా?  అనే ప్రశ్నలు ప్రజల వైపు నుంచి వినిపిస్తున్నాయి.  జగన్మోహన్ రెడ్డి ‘విశాఖలో రాజధాని’ అనే తన మాట నెగ్గించుకోవడానికి,  కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles