జగన్ ఉవాచ: దెయ్యాలు వేదాలు వల్లించినట్టు!

Wednesday, January 22, 2025

దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత ఎలాంటి నేపథ్యంలో పుట్టినదో మనకు తెలియదు గానీ.. నరసాపురం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత మాత్రం.. ఆ సామెత అచ్చంగా అతికినట్టు సరిపోతుందని తెలుస్తుంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి జగన్.. బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల గురించి, రౌడీయిజం చేసే రాజకీయ నాయకుల గురించి.. తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశాన్ని తెలుగు బూతుల పార్టీగా అభివర్ణించిన జగన్, అదే జనసేనను రౌడీసేనగా పేర్కొనడం విశేషం. జగన్ దృష్టిలో బూతులు, రౌడీయిజం అనగా ఎలాంటి నిర్వచనాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన కళ్లకు ఆ రెండు పదార్థాలు ఎలా కనిపిస్తాయో మనకు తెలియదు. కానీ.. తన పార్టీ కీలక నాయకులు మాట్లాడే మాటలు.. శ్రవణ పేయమైన లలితగీతాల్లాగా ఆయనకు వినిపిస్తున్నాయేమో.. తన పార్టీ కార్యకర్తలు దందాలతో చెలరేగుతున్న ప్రతి యవ్వారమూ ఆయనకు సంఘసేవా దురంధరత లాగా అనిపిస్తున్నదేమో. తనలోని దృష్టి దోషాన్ని గురించి డాక్టరుకు చూపించుకోవాల్సింది బదులు.. జగన్ తెలుగుదేశాన్ని బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా ఎద్దేవా చేయడమే తమాషా!

నేను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అన్నాడుట.. వెనకటికి జగన్ లాంటి ఎవరో ఒక పెద్దమనిషి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ వాళ్లు మాట్లాడే బూతులన్నీ భాషా పరిపుష్టికి చేసే సేవలాగా కనిపిస్తున్నట్టుంది. రాయడానికి కాదు కదా.. వినడానికి కూడా అసహ్యంగా, గలీజుగా అనిపించే బూతులు మాట్లాడడంలో వైసీపీలో ఎందరు నాయకులు ఆరితేరిపోయారో అందరికీ తెలుసు. తమ గలీజు మాటలతో వాళ్లు రాజకీయ ప్రత్యర్థుల్ని తిడుతూ ఉంటే.. అదంతా జగన్ కు సమ్మగా అనిపిస్తుంటుందేమో గానీ.. ప్రజలకు చీదర పుడుతుంటుంది. వారి మాటలు వినడానికి, విని ఆనందించడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డికి.. తెలుగుదేశం వారు మాట్లాడేది బూతులుగా ధ్వనించడంలో తప్పులేదు. 

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో ఎలాంటి దందాలు నడిపిస్తున్నారో రాష్ట్రమంతా స్వయంగా చూస్తోంది. అలాంటిది జనసేన పార్టీని పట్టుకుని.. రౌడీసేనగా అభివర్ణించడం జగన్ కే చెల్లింది. తమ వాళ్లు చేసే దాడులు, తమ సొంత పార్టీ వాళ్లే రెండు ముఠాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఫ్లెక్సిలు చించేసుకోవడాలు.. ఇలాంటి కార్యకలాపాలన్నీ జగన్ కు ఏ రకంగా కనిపిస్తున్నాయో గానీ.. జనసేన పనులు రౌడీయిజం అనిపిస్తున్నాయిట. 

మామూలుగా అంతో ఇంతో ఒక ఫ్లోలో మాట్లాడే అలవాటున్న జగన్మోహన్ రెడ్డి.. నరసాపురం ఆక్వా యూనివర్సిటీ ప్రారంభం తర్వాత జరిగిన సభకు సరిగా ప్రిపేర్ అయినట్టు లేదు. ప్రతి అక్షరమూ చూసి చదువుతూ.. పదేపదే తప్పులు చదువుతూ.. ఎంపీటీసీ అనే పదం కూడా సరిగా పలకలేకుండాపోయిన స్థితిలో.. తెలుగుదేశం బూతుల గురించీ.. జనసేన రౌడీయిజం గురించీ మాత్రం వెల్లడించారు. ముందే చెప్పినట్లు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా.. జగన్ ఇలాంటి మాటలు మాట్లాడితే.. జనం నవ్వుకుంటారనే వెరపు ఆయనకు ఉన్నదో లేదో తెలియడం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles