ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయంటారు పెద్దలు. రాజకీయాల్లో అయినా అంతే! ఒకే మాదిరి బుద్ధులు ఉన్నవారు.. ఒకరితో ఒకరు ఆత్మీయంగానే ఉంటారు. ఒకేమాదిరి ట్రాక్ రికార్డు ఉన్నవారు.. ఒకరిపట్ల ఒకరు ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. అందుకే కాబోలు.. ఏపీసీఎంగా అధికారంలో ఉండగా ఒక్క మద్యం కుంభకోణంలోనే 30వేల కోట్ల రూపాయలకు మించి మింగిన భారీ కేసుల్లో తెరవెనుక ప్రధాన వ్యక్తిగా ఆరోపణలు ఎ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల రూపాయలు దిగమించిన కీలక సూత్రధారిగా జైలులో కూడా ఉండి ప్రస్తుతం రిమాండుపై బయట గడుపుతున్న తెలంగాణ నాయకురాలు.. కల్వకంుట్ల కవిత చాలా ఘాటుగా మద్దతు ఇస్తున్నారు. మరో తమాషా ఏంటంటే.. ఈ ఇద్దరు నాయకులు కూడా.. ప్రస్తుతం బెయిలు మీద బయటగడుపుతున్న నిందితులే కావడం విశేషం. జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్లుగా బెయిలుపై బయట ఉన్న సీనియరు కాగా, కవిత ట్రాక్ రికార్డులో ఏడాది సీనియారిటీ మాత్రమే ఉంది.
ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. జగన్ ను ఆకాశానికెత్తేశారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నాయకుడు. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ 2.0ను చూస్తున్నాం’ అని కల్వకుంట్ల కవిత కితాబులిచ్చారు. జగన్ తాను ముఖ్యమంత్రిగా 2.ఓ పాలనను ప్రజలకు రుచిచూపిస్తానని ప్రగల్భాలు పలుకుతుండగా.. కవిత మాత్రం.. ప్రస్తుతం ప్రతిపక్ష్ః నాయకుడిగా ఆయన 2.ఓ పాలన చూస్తున్నాం అంటూ.. సెలవివ్వడం విశేషం.
జగన్ పాల్పడిన అవినీతి, అరాచక వ్యవహారాలు, తప్పుడు పనులన్నిటినీ.. వెనకేసుకు వస్తూ ఆయన మీద నమోదైన కేసులు జైలుకు వెళ్లాల్సి రావడం లాంటి వ్యవహారాలను ఆమె పోరాటయోధుడుకింద అభివర్ణిస్తున్నారు. ఇంతకంటె చవకబారుతనం మరొకటి ఉంటుందా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. కల్వకుంట్ల కుటుంబానికి- జగన్మోహన్ రెడ్డికి అనుచితమైన అక్రమ లావాదేవీలు అనేకం ఉన్నాయనేది అందరూ అనుకునే మాట. కల్వకుంట్ల తండ్రీ కొడుకులు కేసీఆర్- కేటీఆర్ కూడా నిత్యం జగన్ ను కీర్తిస్తూనే గడుపుతుంటారు. ఎన్నికలపర్వం ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. వారిద్దరూ కూడా వేర్వేరు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ.. జగన్ గతంలో గెలిచిన 151 కంటె ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ తమ సర్వేలు చెబుతున్నాయని జోస్యం పలికారు. ఇప్పుడు ఆయనను పొగడడానికి కవిత వంతు వచ్చింది.
అదే సమయంలో.. పవన్ కల్యాణ్ ను తాను సీరియస్ గా తీసుకోవడం లేదని, దురదృష్టవశాత్తూ ఆయన పొరుగురాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారని, పవన్ కు సంబంధించిన ప్రశ్నలపై స్పందించనని అన్నారు కవిత. జనం మాత్రం బెయిలు మీద బతికేవాళ్లకు క్లీన్ పాలిటీషియన్స్ నచ్చరు అని నవ్వుకుంటున్నారు.