విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి తన నివాసం కోసం నిర్మించుకుంటున్న భవనం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లోపడుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఖర్చు వివరాలు లెక్కలు కూడా బయటకు వచ్చిన తర్వాత.. జగన్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జనసేన- నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో నిశిత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం నివాసం కోసం ఏకంగా 433 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం మాత్రమే కాదు.. కేవలం అక్కడ పచ్చదనం కోసం 21 కోట్లను ఖర్చు చేస్తున్నారంటే.. జగన్ భోగలాలసతను అర్థం చేసుకోవాలని, ప్రజల సొమ్ముతో ఆయన ఎంతగా విలాసాలను అనుభవించాలని అనుకుంటున్నారో అర్థమవుతోందని నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పిస్తున్నారు.
టూరిజం భవనాల పేరుతో రుషికొండను ధ్వంసం చేయడం ప్రారంభించిన తొలినాటినుంచి ప్రభుత్వం వదల రకాల అబద్ధాలు చెబుతూనే వస్తోంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో కూడా అనేకానేక అసత్యాలు, అర్థసత్యాలు చెబుతూ వచ్చారు. అది టూరిజం భవనాలని, డీలక్స్ అతిథిభవనాలు నిర్మిస్తున్నారని రకరకాలుగా మభ్యపెడుతూ వచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వంటి వారిని అక్కడ భవనాలను పరిశీలించేందుకు అనుమతించారు గానీ.. వారిని కూడా మభ్యపెట్టారు. అన్నీ చూసి వచ్చిన ఆయన.. ఇవి నివాస భవనాల లాగా కనిపించడం లేదని సర్టిఫై చేయడం ఒక మలుపు. అయితే జనసేన గానీ, తెలుగుదేశం గానీ.. తొలినుంచి అవి జగన్ నివాసం కోసం చేపడుతున్న భవనాలుగానే పేర్కొంటున్నారు. తీరా ఇప్పుడు సీఎం విశాఖ వెళ్లడం దాదాపుగా ఖరారవుతోంది.
ఈ సమయంలో రుషికొండ విధ్వంసం మరియు భవనాల నిర్మాణం కోసం పెడుతున్న ఖర్చు లెక్కలు కూడా బయటకు వచ్చాయి. కోర్టు ఆదేశాలతోనే ఈ ఖర్చుల లెక్కల వెలికి రావడం విశేషం. ఈ భవంతి కోసం ఏకంగా 433 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. అంతే కాదు.. అక్కడ పచ్చదనం కోసం ఏకంగా 21 కోట్లు ఖర్చు పెడుతున్నారని కూడా అంటున్నారు. పేదలకు సెంటు భూమిలో ఇళ్లు అంటున్న జగనన్న, ఆ కాలనీల్లో కనీస వసతులు కూడా కల్పించకుండానే.. తన ఇంటికోసం 9 ఎకరాల స్థలంలో వందల కోట్లు ఖర్చు పెట్టడంలోని విజ్ఞతను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జనసేన విమర్శల జడిలో.. రుషికొండ భవనాలు అనేవి జగన్మోహన్ రెడ్డికి అపకీర్తి తెచ్చేలా కనిపిస్తున్నాయి.
లెక్కలు బయటికొచ్చాక చిక్కుల్లో జగన్!
Wednesday, January 22, 2025