జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న అయిదేళ్లు పాటు కూడా.. ఆర్ఆర్ఆర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నాయకుడు రఘురామక్రిష్ణరాజు.. ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. రచ్చబండ పేరుతో క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ ప్రభుత్వం మీద నిశిత విమర్శలు చేస్తూ వచ్చారు. అది రచ్చబండ కాదుకదా.. చాకిరేవు బండ అన్నట్టుగా.. ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్ 11 సీట్ల పార్టీకి నేతగా మిగిలిపోయారు. రఘురామ డిప్యూటీ స్పీకరు అయ్యారు. ఈ పరిస్థితుల్లో.. రఘురామ కారణంగా.. జగన్మోహన్ రెడ్డికి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేలా ఉంది.
రఘురామ క్రిష్ణ రాజు.. సుప్రీంలో వేసిన పిటిషన్ కారణంగా..జగన్మోహన్ర్ రెడ్డి మీద కేసులు అన్నీ త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన బెయిలు రద్దయ్యే ప్రమాదం కూడా ఉన్నదని కొందరు విశ్లేషిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ విపరీతంగా ఆలస్యం అవుతోందంటూ.. రఘురామ చాలాకాలం కిందటే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ దావాపై విచారణ జరిగింది. అందుకు కారణాలు ఆరాతీస్తే.. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో పెండింగులో ఉన్నందువల్లే తెమలడం లేదని న్యాయవాదులు తెలిపారు.
అయితే.. మొత్తం జగన్ అక్రమాస్తులకు సంబంధించి.. ఏయే కేసులు పెండింగులో ఉన్నాయో అన్నింటి వివరాలను పూర్తిస్థాయిలో తమకు రెండు వారాల్లోకా అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దానిని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని వెల్లడించింది. డిసెంబరు 13కు కేసు వాయిదా వేశారు. డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లను జగన్ తరపున ఉద్దేశపూర్వకంగా కోర్టులో వేస్తూ.. విచారణ జాప్యానికి కారణమవుతున్నారని సుప్రీం కోర్టు భావిస్తే గనుక.. ఒక సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. జగన్మోహన్ రెడ్డి బెయిలు కూడా రద్దు కావచ్చునని, సుప్రీం సూచనల్ని బట్టి.. కేసులన్నీ త్వరలోనే తెమలవచ్చునని అనుకుంటున్నారు.
అసలే అధికారంలో కోల్పోయిన తర్వాత.. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని జగన్ కు ఎదురవుతున్న అదనపు ట్రబుల్ ఇది. మొదటి ట్రబుల్- జగన్ నే నిందితుడిగా చేర్చిన కేసు సీఐడీ విచారణలో ఉంది. గత ప్రభుత్వకాలంలో సీఐడీ పోలీసులతో తనమీద హత్యాయత్నం చేయించారంటూ.. జగన్ మీద రఘురామ కేసు పెట్టారు. అది విచారణ జరుగుతోంది. త్వరలోనే జగన్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది.