ఇప్పుడు ప్రభుత్వం సొమ్ముతోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబునాయుడు ఉంటున్న స్నేహ బ్లాక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలి. ఆయన ఆరోగ్యం అదుపుతప్పుతున్న సమయంలో, అలర్జీలు వేధిస్తున్న సమయంలో.. ఆయన ఆరోగ్యం గురించి యావత్తు రాష్ట్రం ఆందోళన చెందుతున్న సమయంలో.. జగన్ సర్కారు ఒక మెట్టు దిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏసీ ఏర్పాటు చేయడం గురించి సాక్షాత్తూ ఏసీబీ కోర్టు ఆదేశించిన తర్వాత.. ఇప్పుడు వారికి ఆ పని చేయకతప్పదు.
చంద్రబాబు
నాయుడును అరెస్టు చేసిన తర్వాత.. అవినీతికి పాల్పడిన వారు అరెస్టు కాకుండా ఎలా ఉంటారు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సన్నాయి నొక్కులు నొక్కింది. చంద్రబాబు పట్ల జగన్ సర్కారు కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వంలోని వారందరికీ మేం కక్ష సాధించడం లేదు.. అని చెప్పుకోవడం పెద్ద పని అయిపోయింది. మేమెందుకు కక్ష కడతాం. మాకేం అవసరం. ఆయనంటే మాకెందుకు పగ. తప్పు చేశారు.. జైలుకు వెళ్లారు. అని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. తప్పు చేసిన ఏ వ్యక్తి జైలుకెళ్లినా.. వాల్లు టపాకాయలు కాల్చి , డ్యాన్సులు ఆడి సెల్రబేట్ చేసుకుంటారో ఏమో తెలియదు.
అయితే పాయింట్ ఏంటంటే.. చంద్రబాబు మీద ప్రభుత్వానికి కక్ష లేదు- చట్టం ప్రకారం వెళుతున్నారు.. అని నిరూపించుకోగల ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. జైల్లో ఉన్న చంద్రబాబునాయుడుకు ఏసీ సదుపాయం కల్పించాలని తొలిరోజుల్లోనే తెలుగుదేశం నాయకులు జైలు అధికార్లను అభ్యర్థించారు. చంద్రబాబు స్వయంగా తన బ్లాకులో ఫ్యాను కూడా పనిచేయడం లేదని కూడా ఆవేదనతో చెప్పుకున్నారు. ప్రభుత్వం అప్పుడే స్పందించడానికి అవకాశం ఉంది. అలా జరగలేదు. ప్రతిసారీ ఆయనకు బోలెడంత భద్రత కల్పించాం అని చెబుతారే తప్ప.. ఆయనకు ఏం వసతులు కల్పించారో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కరు కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒక్క ఏసీ ఏర్పాటు చేయించడంలో.. ప్రభుత్వానికి పోయేదేమీ లేదు. కానీ ప్రభుత్వం కక్ష కట్టలేదనే అభిప్రాయం ప్రజలకు కలిగి ఉండేది.
ఇప్పుడు ఏకంగా కోర్టు ఆదేశించడంతో వేరే గతిలేక ఏర్పాటు చేయించాల్సి వస్తోంది. ఇదే పని వారు ముందే స్వచ్ఛందంగా చేసి ఉంటే.. శత్రువును కూడా గౌరవించే సౌహార్ద వ్యక్తిత్వం ఉన్నవారుగా పేరు తెచ్చుకుని ఉండేవారు. అలాంటి అవకాశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది.