అధికారంంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు.. ఆ నిర్ణయాలు, పాలన తీరు నచ్చని వ్యక్తులు కొందరు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమలోని అసంతృప్తిని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఉత్తములైన పాలుకులు అయితే.. ఆ అసంతృప్తిని విని.. తమ పాలనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో క్రాస్ చెక్ చేసుకుని.. దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కనీసం మామూలు నాయకులు అయినా సరే.. ఆ అసంతృప్తులను నిరసన స్వరాలను పట్టించుకోకుండా వదిలేస్తారు. అంతే తప్ప.. తమ పట్ల నిరసన, అసంతృప్తి అనే ఛాయ కూడా కనిపించడానికి వీల్లేదని మొండిపట్టు పడతారా? రంగులకు కూడా భయపడుతూ ప్రజాగళాన్ని తొక్కేయడానికి అసలు ప్రయత్నించేవారుంటారా? ఉంటారు.. అంత బీభత్సమైన రేంజిలో ప్రజల్లోని అసంతృప్తి గురించి భయపడే నాయకులు ఒకరున్నారు.. ఆయనే జగన్మోహన్ రెడ్డి.
ప్రజలంటే జగన్ కు అణువణువునా భయం. వాళ్ల కళ్లలోకి చూసి మాట్లాడాలంటే భయం. వాళ్లు వేసుకునే దుస్తులు అంటే భయం. వాళ్లు ధరించే చెప్పులు అంటే భయం. వాళ్ల రెయిన్ కోట్లు అయినా భయం.. మతసాంప్రదాయం నిర్దేశిస్తుంది గనుక.. ముస్లిం మహిళలు బురఖా ధరించినా, దానిని చూస్తే భయం.
అదేదో సినిమాలో ‘నాకు గుడుగుడంటే బయ్యం..’ అంటూ సాగే ఐటెం సాంగ్ లాగా.. ముఖ్యమంత్రి జగన్ కు నలుపు రంగంటే తెగని భయంరో.. అని ప్రజలు అనుకుంటున్నారు. నరసాపురంలో ముఖ్యమంత్రి సభ జరిగింది. ఆ సభ సందర్భంగా ఊరంతా విపరీతమైన ఆంక్షలు విధించారు. కనీసం రోడ్ల పక్కన హాకర్ల బండ్లన్నింటినీ కూడా మూయించారు. చివరి కార్తీక సోమవారం అనే భక్తితో గుడికి వెళ్లే వారికి కూడా ఈ ఆంక్షల బెడద తప్పలేదు. సాయంత్రానికి అయితే దాదాపుగా కర్ఫ్యూ వాతావరణమే. సీఎం సభా ప్రాంగణం తప్ప.. మరోచోట నరమానవుల కదలికలను అనుమతించం అన్నట్టుగా పోలీసులు వ్యవహరించారు. ఈ ఆంక్షల క్రమంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేయడం అనేది మామూలు సంగతి. ఎక్కడికక్కడ సీఎం వ్యతిరేక గళం వినిపిస్తారని అనుకున్న వారినందరినీ నిర్బంధించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సీఎం సభకు వచ్చిన వారి దుస్తుల విషయంలో విధించిన ఆంక్షలు ఇంకో ఎత్తు. డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించడమూ, సభ మద్యలో వెళ్లిపోకుండా కాపలా కాయడమూ ఇవన్నీ ఒక ఎత్తు. కానీ వచ్చిన వాళ్లు నల్ల డ్రస్సులో ఉంటే సీఎం సభకు లోపలకు అనుమతి లేదు!! మహిళలు నల్ల చున్నీ ధరించినా కూడా లోనికి రానివ్వలేదు. ముస్లిం మహిళల బురఖాలను బయట తీసిపెట్టమని అన్నారు.. ఆ ఆంక్షలు నచ్చక పలువురు బయటినుంచే వెళ్లిపోయారు. ఉదయం వర్షం కారణంగా కొందరు నల్లటి రెయిన్ జాకెట్లు ధరించి వస్తే వాటిని కూడా బయటే వదిలేసి లోపలకు వెళ్లాలని నిర్దేశించారు.
ముఖ్యమంత్రి జగన్ తాను అద్భుతమైన పాలన చేస్తున్నానని, సంక్షేమం వెల్లువ అని.. రాబోయే ఎన్నికల్లో తాను ఏ కొత్త ప్రయత్నమూ చేయకపోయినా సరే.. ప్రజలు బ్రహ్మరథం పట్టి.. మరో 30 ఏళ్ల పాటూ తనను సీఎంగా కూర్చోబెడతారని అనుకుంటూ ఉంటారు. మరి ఇలా ప్రజలనుచూస్తే.. నలుపురంగును చూస్తే అంతగా భయపడిపోవడం ఎందుకో అర్థం కాదు. ప్రజలు కనిపించే సభకు వెళ్లాల్సి వచ్చినప్పుడెల్లా.. వారు ఎలాంటి నిరసనలు తెలియజేస్తారో అని భయపడడం ఏంటో బోధపడదు. ప్రజల గళాన్ని ఆలకించి సమస్యలు తీర్చే ఆలోచన నాయకులకు ఉండాలి గానీ.. వారి స్వరానికి, ధరించే వస్త్రాల రంగులకు కూడా ఇంతగా భయపడే వ్యక్తి అసలు నాయకుడిగా ఎలా తనను తాను ఊహించుకుంటారో ఏమిటో అర్థం కాదు!!