ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నదని సామెత. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె చిత్రంగా ఏమీ లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే పాతాళానికి కుంగిపోయి ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికలను ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేవు. కాగా, సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశమే కనిపించడం లేదని అందుకే ఈ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నదని జగన్ ప్రకటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరులకు నిరసనగా ఇలా ఎన్నికలనే బహిష్కరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రూపంలో అయినా సరే.. ఎన్నిక అంటేనే వైసీపీ వారు భయపడేలా ఉన్నారు. గెలిచేంత సీన్ తమ పార్టీకి లేదుగానీ.. ఎన్నికల పేరుతో భారీగా ఖర్చు పెట్టాలని పార్టీ అధిష్ఠానం తమ మీద ఒత్తీడి తెస్తుందనే భయంలో నలుగుతున్నారు. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా పోటీచేయడానికి అసలు మనుషులే ముందుకు రావడం లేదు. ప్రత్యేకించి ఎన్డీయే కూటమి ప్రభుత్వం గద్దె ఎక్కిన తరువాత.. నీటివనరులకు ఎలాంటి మహర్దశ పట్టబోతున్నదో స్పష్టంగా రాష్ట్ర ప్రజల కళ్లెదుట కనిపిస్తూనే ఉన్నది.
ఒకవైపు పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో అడుగులు వేస్తుండడం దగ్గరినుంచి, మరొకవైపు చిన్న చిన్న నీటివనరులను కూడా సమృద్ధిగా ఉంచే ప్రయత్నాలు.. అలాగే నదుల అనుసంధానం ద్వారా.. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించే ఆశయంతో వేస్తున్న అడుగులు ఇవన్నీ ప్రజల్లో, రైతుల్లో ఆశలు పెంచుతున్నాయి. ఇలాంటి నమ్మకం కారణంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీల అభ్యర్థులదే ఖచ్చితంగా పైచేయి ఉంటుందని అనుకోవచ్చు. ఎటూ తాము గెలవలేం అనే భయంతో వైసీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటిస్తోంది.
ప్రభుత్వంలోని పార్టీలు ప్రతిచోటా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాల్ని వాడుకుంటూ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న వైసీపీ వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా రౌడీయిజం చేస్తున్నందువలన.. అసలు తమ పార్టీ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నాయినొక్కులు నొక్కుతున్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు.