ఓడిపోయే క్షణం వరకు ‘గెలవబోయేది తామే’ అని ప్రకటించుకోవడం రాజకీయ నాయకుల మొదటి లక్షణం. వారి వారి సర్వేలలో వారు గెలుస్తున్నారా ఓడుతున్నారా అనే సంగతి వారికి స్పష్టంగానే అర్థమైపోతుంది. అయితే మాటలు మాత్రం డాంబికంగానే పలుకుతుంటారు. మనం మాత్రం వారి మాటలను బట్టి కాకుండా, వారి వ్యవహారాన్ని బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓడిపోతున్న సంగతి సొంత సర్వేలలోనే బయటపడినప్పటికీ.. చాలా ఆర్భాటంగా.. గత ఎన్నికల కంటే ఘనమైన మెజారిటీ సీట్ల సంఖ్యతో ఈసారి నెగ్గబోతున్నాం… అంటూ ప్రకటనలు చేయడం ఆ పార్టీ నాయకులకు మాత్రమే చెల్లింది. కానీ ఇతరత్రా విషయాలలో.. అనగా తమ సొంత పార్టీకి చెందిన, అస్మదీయులు అయిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలోనూ, ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను అప్గ్రేడ్ చేసే ముసుగులో మార్పు చేర్పులు చేసేయడానికి తొందరపడడంలోనూ వారి ఆత్రుత చూస్తుంటే ఓటమి తథ్యమని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ డాంబికపు ప్రకటనలు చేయడంలో మాత్రం బాప్ ఏక్ నెంబర్ కా.. బేటా దస్ నెంబర్ కా అనే సామెత తరహాలో ‘జగన్ ఏక్ నెంబర్ కా.. బొత్స దస్ నెంబర్ కా’ అని ప్రజలు అనుకుంటున్నారు.
సంగతి ఏంటంటే విజయవాడలోని ఐ ప్యాక్ కార్యాలయాన్ని గురువారంనాడు సందర్శించిన జగన్ మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తాము మళ్ళీ గెలవబోతున్నాము అంటూ చాలా ఘనంగా ప్రకటించారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు కంటే ఎక్కువగా 2024 ఎన్నికలలో తాము సాధిస్తున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసినవే మేకపోతు గంభీర్యపు ప్రకటన అనుకుంటూ ఉంటే.. మంత్రి బొత్స సత్యనారాయణ తాను మాత్రం తక్కువ తిన్నానా అని మరింతగా రెచ్చిపోతున్నారు.
ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయం చేశా రు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడబోతుండగా.. అదే నెలలో జూన్ 9వ తేదీన శుక్ల తదియను మంచి ముహూర్తంగా బొత్స నిర్ణయించడం విశేషం. పైగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారంటూ ఇంకా మభ్యపెట్టే ప్రకటన చేయడం ఆశ్చర్యకరం. విశాఖ లో ప్రమాణం అంటున్నారే తప్ప ‘ఆ విశాఖ ఆరోజు నుంచే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుంది’ అనే మాట చెప్పడానికి వారికి ధైర్యం చాలడం లేదు. మరోసారి అభాసుపాలవడం తప్ప దక్కేది వేరే ఏమీ లేదని వారు జంకుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్లో కీలక నాయకులు తెచ్చిపెట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంలో పోటీపడుతున్నట్లున్నారు.
జగన్ ఏక్ నెంబర్ కా.. బొత్స దస్ నెంబర్ కా!
Wednesday, December 25, 2024