జగన్ జీవితంలో జవాబు చెప్పలేని ప్రశ్నలివే!

Saturday, October 5, 2024

జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ప్రారంభించబోయే పాదయాత్ర ద్వారా నారా లోకేష్, ఎప్పటినుంచి అనేది ఇంకా ముహూర్తం నిర్ణయించకపోయినప్పటికీ.. వారాహి వాహనం ఎక్కి యాత్ర సాగించబోయే పవన్ కల్యాణ్.. ఎలాంటి ప్రజాస్పందన రాబడతారో ఇంకా తెలియదు గానీ.. సుడిగాలిలాగా రాష్ట్రమంతా చుట్టబెడుతూ.. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాలను సభలను, రోడ్ షోలను నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు మాత్రం.. అనూహ్యమైన స్పందన రాబడుతున్నారు. ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఊరూరా తిరుగుతూ.. జగన్ సర్కారు వైఫల్యాలతో పాటు స్థానికంగా వైసీపీ శ్రేణులు సాగిస్తున్న దోపిడీని కూడా ఆయన ప్రజల ఎదుట నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన కర్నూలు జిల్లా సహా అనేక ప్రాంతాల్లో చంద్రబాబుకు మంచి ప్రజాస్పందన లభిస్తోంది. అయితే కొత్త విషయాలు కాకపోయినప్పటికీ.. బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు సంధించిన రెండు ప్రశ్నలు బహుశా జగన్ ఎప్పటికీ సమాధానం లేనివి అవుతాయి. 

బీసీలకు మేలు చేయలేదు, ఎస్సీలకు అన్యాయం చేశారు లాంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తుంటాయి. ప్రభుత్వం దానికి జవాబుగా బీసీలకు, ఎస్సీలకు అది చేశాం ఇది చేశాం అని పత్రికాప్రకటనలు గుప్పిస్తుంది. సభలు పెట్టి డబాయించి చెబుతుంది. కానీ.. ఈ రెండు ప్రశ్నలు ఎదురైతే ప్రభుత్వం ఏం సమాధానం చెప్పగలుగుతుందో అర్థం కావడం లేదు. 

ఆ రెండు ప్రశ్నలేమిటో తెలుసా..

1) అన్న క్యాంటీన్లను ఎందుకు తొలగించారు?

మాటిమాటికీ సంక్షేమం అనే మాట వాడే జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లను ఎందుకు తొలగించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పేదవాడికి అన్నం పెట్టడం కంటె పెద్ద సంక్షేమం ఉన్నదా అని కూడా ప్రశ్నించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి పేదవాడి ఆకలి తీరుస్తాం అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది. ఆకలితో ఉన్న వాడికి అన్నంపెట్టే పథకం మీద జగన్ సర్కారు విషం చిమ్మింది. అధికారంలోకి రాగానే వాటిని మూసేయించారు. అంతకంటె రాక్షసంగా అనేక చోట్ల అన్న క్యాంటీన్ భవనాలను కూల్చివేయించారు. వాటికి రంగులు మార్చుకుని వైఎస్సార్ క్యాంటీన్ అని పేరు మార్చుకుని కొనసాగించినా బాగుండేది. కానీ.. పేదవాడి కడుపు నింపే పథకంపై కక్ష చూపించారు. తెలుగుదేశం పూనికతో పార్టీ నాయకులు అక్కడక్కడా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేస్తే వాటి మీద కూడా దాడులుచేస్తూ అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఇది జగన్ తన జీవితంలో ఎప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్న.

2) ఇసుక ధర ఎందుకు ఇంతగా పెరిగింది?

చంద్రబాబునాయుడు పాలనలో ఇసుక ఉచితంగా ఇవ్వడం జరిగేది. రవాణా ఖర్చులు పెట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు జగన్ వచ్చాక.. పైనుంచి కిందిదాకా ప్రతి ఒక్కరూ కలిపి ఉమ్మడిగా దోచుకుని పంచుకోవడానికి ఇసుక అనేది ఒక రాజమార్గం అయింది. ఇసుక అసలు దొరకకుండా చేసి.. నిర్మాణరంగాన్ని అతలాకుతలంచేసి ఆత్మహత్యలకు, చావులకు కారణమైన ఈ ప్రభుత్వం తర్వాత.. ధరలను విపరీతంగా పెంచింది. సీసీ కెమెరాలు లాంటి రకరకాల పేర్లతో మాయ చేస్తూ.. అడ్డగోలు దోపిడీ చేస్తోంది. ప్రభుత్వం ఎంత దోచుకుంటోందనేది కూడా ప్రజలకు అనవసరం. చంద్రబాబు హయాంలో ఉచితంగా దొరికిన ఇసుకకు, జగన్ వచ్చిన తర్వాత ట్రాక్టరుకు 6 వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ ప్రశ్నకు జగన్ ఎప్పటికి సమాధానం చెప్పాలి. ఎలా చెప్పగలరు. 

ఇలా ప్రభుత్వం నోరెత్తలేని విమర్శలతో దూసుకుపోతూ చంద్రబాబు ప్రజల్లో కొత్త ఆలోచన కలిగించగలుగుతున్నారు. చంద్రబాబు విమర్శల దాడికే ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నారా లోకేష్, పవన్ కల్యాణ్ యాత్రలు కూడా మొదలయ్యాక.. బహుశా వైసీపీ దళాలకు ఊపిరి ఆడకుండా పోతుందేమో. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles