మూడు రాజధానులు అనే పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను కూడా ఒక మాయలోకి నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల దసరా పర్వదినం నాటికి తన మకాం విశాఖకు మారుస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. రుషికొండను ధ్వంసం చేసి.. తాను గద్దెఎక్కిన నాటినుంచి ధ్వంసరచనే పాలన మంత్రంగా కొనసాగుతున్నానని భారీస్థాయిలో నిరూపించుకున్న జగన్మోహన్ రెడ్డి.. అక్కడ నిర్మిస్తున్న భవనాల్లోనే సీఎం క్యాంపు ఆఫీసును ఏర్పాటుచేసుకుని.. దసరానుంచి అక్కడకు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఆలోగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేయడానికి రుషికొండ నిర్మాణాల వద్ద శరవేగంగా పనులు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో విశాఖలో రాజధాని దసరానుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని, యథోరీతిగా అక్కడి ప్రజలను ఊరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తమ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్న నేపథ్యంలో పలువురు ఈ విషయంపై భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజధానిగా పరిపాలనను విశాఖ పట్నానికి తరలించడానికి వీల్లేదని, అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ ఇంకా ఏసంగతీ తెమలలేదు. ప్రభుత్వం కోరుకుంటున్న తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో, ఒక్క ఆఫీసునైనా తరలించడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉన్నందున.. రాజధాని తరలింపు అనే వ్యవహారం న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
అయితే జగన్మోహన్ రెడ్డి తన నివాసం విశాఖలో పెటటుకోవాలంటే పెట్టుకోవచ్చు. సీఎం తన క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే.. ఆయన సంతకాలు అవసరమైన ఫైళ్లతో అధికారులు అటూ ఇటూ తిరగడం అనేది ఒక అదనపు శ్రమ అవుతుంది. న్యాయపరమైన చిక్కుల కారణంగా.. విశాఖను రాజధాని అని అక్కడి ప్రజలను నమ్మించేందుకు, తద్వారా ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్ని అక్కడకు తరలించుకోగలరు గానీ, ఆఫీసులను తరలించడం అంత సులువు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత.. సీఎం నివాసం అక్కడ పెట్టుకుని.. వారంలో మూడురోజులు విశాఖలో , మరో మూడు రోజులు తాడేపల్లిలో ఉంటారని పుకార్లు వినిపించాయి. అది నిజమైనా కాకపోయినా.. ఆఫీసుల తరలింపు అనేది, ఆయన నివాసం తరలించినంత ఈజీ మాత్రం కాదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.