జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని, ఆయన ఎడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉన్నదని ప్రతిపక్షాలు ఎవరైనా విమర్శిస్తే వారికి వక్రప్రయోజనాలను అంటగడతారు. బురద చల్లే ప్రయత్నం అని ఎదురుదాడికి దిగుతారు.ఇదే మాటలు ప్రజలు ఎవరైనా అంటే గనుక.. వారి మీద ఏకంగా కేసులు పెట్టి బెంబేలెత్తిపోయేలా చేస్తారు. ప్రభుత్వంలో లోపాలను చెప్పే వారందరినీ పచ్చ మీడియా కింద ఒకటే గాటన కట్టేసి, గోబెల్స్ లాగా విషప్రచారానికి దిగుతారు. అయితే చుట్టపుచూపుగా రాష్ట్రానికి వచ్చిన వారికి కూడా ఇక్కడ ఎడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉన్నదని అనిపిస్తే, ఆ సంగతి వారు సీఎంకు స్వయంగా లేఖ కూడా రాస్తే వీరేమంటారు? తల ఎక్కడ పెట్టుకుంటారు? ఆ అపఖ్యాతిని ఎలా దిద్దుకుంటారు?
రాష్ట్రంలో రెండు రోజులుగా మాండౌస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను బీభత్సాన్ని ఎదుర్కోవడానికి సంబంధించి అధికార్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనే సందేశంతో దానిని ముగించారు. అంతకుమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరైన పర్యవేక్షణ నిఘా ఏమీ నడవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కడప జిల్లాకు వచ్చిన రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం.. వరదలను ఎదుర్కోడానికి ప్రభుత్వ ఏర్పాట్లను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వరద కారణంగా కడప నగరం పరిస్థితి దారుణంగా మారిపోగా.. బినోయ్ విశ్వం , కలెక్టరు కార్యాలయంలోని కాల్ సెంటరును సందర్శించారు. అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. కేవలం నలుగురు స్టాఫ్ మాత్రం ఉన్నారు. ఉద్యోగులు ఏమయ్యారంటే.. సెకండ్ శాటర్ డే అనే సమాధానం వచ్చింది. జిల్లా వరదల్లో మునిగిపోతున్నప్పుడు కలెక్టరు కార్యాలయం రాత్రింబవళ్లు పనిచేయాల్సింది బదులు.. ఈ జవాబు రావడంతో బినోయ్ విశ్వం నివ్వెర పోయారు. కలెక్టరుకు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. పలుమార్లు కాల్ ప్రయత్నించి విఫలం అయ్యారు. మెసేజీలకు కూడా కలెక్టరు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆయన ఏకంగా జగన్ కు లేఖ రాసి ఈమెయిల్ పంపారు. సీఎంవో తో మాట్లాడారు. ‘మీ ప్రభుత్వ హయాంలో విపత్తు నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం బాధాకరం’ అంటూ ఆయన జగన్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ప్రజల వరద ఇబ్బందులను పట్టించుకోవడం గురించి ఇంత అలక్ష్యంగా యంత్రాంగం ఉండడం చూసి ఆయన నివ్వెరపోయారు.
ఇంతకీ ఎవరీ బినోయ్ విశ్వం?
బినోయ్ విశ్వం అంటే కేరళకు చెందిన సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు.రాజ్యసభ ఎంపీ కూడా. 2006-2011 కాలంలోనే కేరళ ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కడపలో ఉక్కు కర్మాగారం సాధించడం కోసం.. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరీ పాదయాత్ర చేయడానికి పూనుకున్న నేపథ్యంలో.. బినోయ్ విశ్వం దానికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. కానీ భారీ వరదల నేపథ్యంలో కడప జిల్లా యావత్తూ అతలాకుతలం అయిపోతున్న నేపథ్యంలో ఆ పాదయాత్ర వాయిదా పడింది. అక్కడి ప్రజల కష్టాలు చూస్తూ.. ప్రభుత్వ సహాయక చర్యలు ఎలా ఉన్నాయో గమనించడానికి ఎంపీ బినోయ్ విశ్వం కలెక్టరు కార్యాలయానికి వెళితే ఈ అనుభవం ఎదురైంది. రాష్ట్ర సర్కారు వైఫల్యాల గురించి.. పొరుగు రాష్ట్రాల దాకా అపకీర్తి పాకుతోంది.