ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ పర్వం పూర్తయింది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా చాలా వరకు ప్రశాంతంగానే పోలింగ్ జరిగినట్టుగా భావించాలి. 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. ఆ సమయానికి క్యూలైన్లలో నిలిచి ఉన్న వారందరూ కూడా ఓటు వేసేదాకా పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో హోరాహోరీగా ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనేక అవాంఛనీయ సంఘటనలు.. చిన్నవో, పెద్దవో జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబునాయుడు ట్వీట్ల ద్వారాగానీ.. ఈసీ కి రాస్తున్న లేఖల ద్వారా గానీ వాటిని ఖండిస్తూ, స్పందిస్తూ ఉన్నారు. మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనీస స్పందన కూడా కనిపించడం లేదేమిటి? అని ప్రజలు విస్తుపోతున్నారు.
ఎన్నికలు జరుగుతున్న క్రమం, పోలింగ్ సరళి పట్ల జగన్ కోటరీ కీలక నాయకులు ఎవ్వరూ స్పందించడం లేదు. సాధారణంగా పోలింగ్ నాడు ఎక్కడ ఏ సంఘటన జరుగుతున్నా.. పార్టీల నాయకులు స్పందించి తమ తమ వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటారు. ప్రజలు నిర్భయంగా బూత్ లకు వచ్చి ఓటు వేయాల్సిందిగా పిలుపు ఇస్తూ ఉంటారు. ఏదో ఒకరీతిగా పోలింగ్ జరుగుతున్న రోజుమొత్తం.. ప్రజలతో టచ్ లో ఉన్నట్టుగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. పోలింగ్ పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. జగన్ కోటరీ పూర్తిగా సైలెన్స్ జోన్ లో ఉండిపోయింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం కాసేపు టీవీల్లో కనిపించారు. ఆయన కుటుంబం సహా పులివెందులలోని భాకరాపురంలో ఓటు వేశారు. ఆతర్వాత ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కడ ఒకటిరెండు నిమిషాలు మీడియాతో మాట్లాడారు. తర్వాత పూర్తిగా అంతర్ధానం అయిపోయారు. అక్కడక్కడా ఇరుపార్టీల ఘర్షణలు, వైసీపీ అభ్యర్థుల మీద కూడా దాడులు వంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఎక్కడా వేటిమీద గానీ.. జగన్ స్పందన లేదు. నిజం చెప్పాలంటే.. రాష్ట్రంలో ఎంత ఉపద్రవం జరిగినా మీడియా ముందుకు వచ్చి స్పందించే అలవాటు ఆయనకు లేదు.
ఆయన తరఫున సకలశాఖల మంత్రి సజ్జల రామక్రిష్ణారెడ్డే అన్ని వ్యవహారాలూ మాట్లాడుతూ ఉంటారు. కానీ పోలింగ్ నాడు ఆయనకూడా మీడియాలో ఎక్కడా కనిపించలేదు. స్క్రిప్టులు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చినప్పటికీ.. తరచుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండే బొత్స సత్యనారాయణ తదితరులు కూడా ఎక్కడా స్పందించలేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తోంటే.. పోలింగ్ సరళిని గమనించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కోటరీ పూర్తిగా నిరాశలో మునిగిపోయినట్టుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క చాన్స్ తర్వాత ఒక్క ఓటమికే ఇంత కుంగిపోతే ఎలా అని కూడా అంటున్నారు?
ఏంటి అర్థం? : జగన్ కోటరీ అంతా సైలెన్స్ జోన్ లోనే!
Sunday, December 22, 2024