తెలంగాణలో పాలేరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఐటీ శాఖ అధికారులు పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించి, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా అన్నట్టుగా అనేక మంది నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తనమీద కూడా ఐటీ దాడులు జరగవచ్చునని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన రెండురోజుల్లోనే అలా జరిగాయి.
అయితే పొంగులేటిపై జరిగిన ఐటీ దాడుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక అంశాలుకొన్ని వెలుగులోకి రావచ్చుననే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. జగన్ కు అత్యంత సన్నిహితుడు, విశ్వసనీయమైన నాయకుల్లో ఒకడు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీగా గెలుపొందాడు. అప్పట్లో .. తాను ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి.. కేంద్రంలో నిర్ణాయక పాత్ర పోషించగలనని జగన్ కలగన్నారు. అది దృష్టిలో ఉంచుకుని పొంగులేటిని గెలిపిస్తే కేంద్రంలో ఆయనను మంత్రిని చేస్తానని కూడా జగన్ ఖమ్మం ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత భారాసలోకి వెళ్లిన పొంగులేటి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయినా జగన్ తో అనుబంధం అలాగే ఉంది. ఏపీలో అనేక వందల వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ప్రాజెక్టులు పొంగులేటి చేసారు. విద్యుత్తురంగంలో అంచనాలు పెంచి మరీ పొంగులేటికే పన్నెండు వందల కోట్ల కాంట్రాక్టు అప్పగించారనే విమర్శలున్నాయి. ఇలా వందల కోట్ల వ్యవహారాలు అనేకం ఉన్నాయి. అయితే వాటన్నింటలోనూ తెరవెనుక వాటాలు కూడా చాలా ఉంటాయనేది సాధారణంగా అందరూ అనుకునే సంగతి.
ఆ బాగోతాలు ఇప్పుడు ఐటీ సోదాల్లో బయటపడతాయేమోనని జగన్ భయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి కాంట్రాక్టులు ఆర్థిక వ్యవహారాల్లో తెర వెనుక అనుబంధాల గురించి అసలు నిజాలు బయటకు వస్తే నష్టం తప్పదనే భయంలో ఉన్నట్టు సమాచారం.అయితే.. పొంగులేటికి తనమీద ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసు.. ఆ విషయం ముందేచెప్పారు గనుక.. ఇబ్బందికరమైన డాక్యుమెంట్లు అన్నీ ముందే ఇతర ప్రాంతాలకు తరలించేసి ఉంటారని.. ఆ రకంగా పొంగులేటి మాత్రమే కాదు జగన్ కూడా సేఫ్ అయి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.
పొంగులేటిపై ఐటీసోదాల్లో జగన్ గుట్టు !
Thursday, December 26, 2024