ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాంలే.. ముందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారాల్సిన అవసరం ఉన్నదని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. స్వచ్ఛత కోసం ఇంట్లోని చెత్తను ఎలాగైతే ఊడ్చి బయటపారేస్తామో.. అదే విధంగా రాజకీయాల్లోని చెత్తను కూడా ఊడ్చి బయటపారేయాల్సిన బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. రౌడీలను, గూండాలను, ప్రజల ప్రాణాలంటే లెక్కలేని వారిని, ప్రజల ఆస్తులను కాజేయాలని చూసేవారిని.. రాజకీయాలనుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదని.. చంద్రబాబునాయుడు అంటున్నారు.
తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాజకీయాలు కలుషితమైపోయాయని అంటూ.. నేరచరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారని, నేర రాజకీయాలు చేసేవారు మనకు అసలు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
తన జీవితంలో ఎఫ్పుడూ హత్యా రాజకీయాలు లేవని, నక్సలిజం, ఫ్యాక్షన్, మతకలహాలపై పోరాడానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నక్సలైట్లు తనను చంపాలని చూస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని అన్నారు.
గత అయిదేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, మేం వచ్చిన తర్వాత ఫాక్షనిజం నివారించామని అన్నారు. హత్యారాజకీయాలు చేయాలని చూస్తే ఎంతటివారినైనా వదలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసి.. ఆ నెపం తనమీదకు నెట్టి మాయ చేయడానికి ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలను కూడా చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.
రాజకీయాల్లో చెత్తనుకూడా ఊడ్చిపారేయడం అని చంద్రబాబు అంటున్న మాటలు యథాతథంగా నిజమయ్యే పరిస్థితే కనిపిస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి జమానాలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన అనేకమంది నాయకులు.. ఇప్పుడు వివిధ రకాల కేసుల్లో కటకటాల పాలు కావడానికి రెడీ అవుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్టు కాబోతున్నారు. పేర్ని నాని, వల్లభనేని వంశీ తదితర నాయకులుకు ముందస్తు బెయిల్ రక్షణ లేకుండాపోయింది.
విడదల రజని తదితర నాయకులకు కూడా వేర్వేరు కేసుల్లో నోటీసులు సర్వ్ అయ్యాయి. ఒకవైపు అనంతబాబు వంటి నాయకులు సాగించిన హత్యాకాండపై పునర్విచారణకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తోంటే.. రాబోయే కొన్ని నెల్లలోగా.. వైసీపీలో గతంలో అధికార మదంతో అడ్డగోలుగా వ్యవహరించిన ప్రతి నాయకుడు కూడా కటకటాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. రెండు మూడునెలల్లోగా చంద్రబాబు ఎవరి గురించి అయితే రాజకీయాలు కలుషితం అయ్యాయని ఆవేదన చెందుతున్నారో.. ఆ కాలుష్యం మొత్తం ప్రక్షాళన అయ్యే అవకాశం ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
