శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం.
శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. ఇక్కడి స్థానికుల కధనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు.ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునే వారు. పల్లవులు, విజయనగరరాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.
కోరిన కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి:
భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు.
పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.