వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ పోకడలకు హైకోర్టు మరో చెంపదెబ్బ వేసింది. మన దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదని, తాము అధికారంలో ఉన్నాం కదాని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం అంటే కుదరదని హెచ్చరికలాంటి తీర్పు ఇచ్చింది. విపక్షాలు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ నిరసన తెలియజేయాలనుకున్నా వాటికి అనుమతులు ఇవ్వకుండా ఉక్కుపాదంతో అణిచివేసే ప్రభుత్వవైఖరిని తప్పుపడుతూ హితోపదేశం చేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో.. కడపలో ఉక్కు పరిశ్రమ సాదనకోసం తలపెట్టిన పాదయాత్రకు తక్షణం అనుమతులు ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పు సందర్భంగా ప్రభుత్వం పోలీసుల తీరుపై కోర్టుచేసిన వ్యాఖ్యలు గమనార్హం.
కడపలో ఉక్కు పరిశ్రమ అనేది.. సుదీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్య అనేది అందరికీ తెలుసు. వైఎస్సార్ హయాం నుంచి దీనికి సంబంధించి ప్రజల ఆశలు ఇప్పటికీ నిజం కాలేదు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా తన సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి చిత్తశుద్ధితో పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సాధనకోసం, తద్వారా ఉద్యోగావకాశాల కల్పనను డిమాండ్ చేస్తూ.. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కడపలో డిసెంబరు 9 నుంచి 13 వరకు పాదయాత్ర సంకల్పించారు. పోలీసులను ఎన్నిసార్లు అనుమతి అడిగినా తిరస్కరించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో.. ప్రభుత్వానికి చెంపదెబ్బ తప్పలేదు. తక్షణం అనుమతులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సభలు ప్రాథమిక హక్కులో ఒక భాగమని న్యాయస్థానాలు పలుమార్లు చెప్పినా పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని హితవు పలికింది. ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదులు అని కూడా పేర్కొంది. వందమందితో శాంతి యుతంగా పాదయాత్ర చేస్తామని అంటోంటే.. శాంతి భద్రతల పేరిట అనుమతి నిరాకరించడం కరెక్టు కాదని పేర్కొంది. మొత్తానికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది.
చెంపదెబ్బలు వేయించుకోవడం కొత్త కాదు..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు చేత మొట్టికాయలు, చెంపదెబ్బలు వేయించుకోవడం ఇదేం కొత్త కాదు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ఎన్నెన్ని నిర్ణయాలను హైకోర్టు తీర్పు తర్వాత మార్చుకోవాల్సి వచ్చిందో లెక్కేలేదు. మొన్నటికి మొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రుషికొండను సందర్శించాలంటే కూడా అనుమతులు ఇవ్వకుండా అభాసుపాలయ్యారు. ఆయన హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుని రుషికొండను సందర్శించారు. విపక్షాలకు చెందిన ఎవ్వరు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే.. అనుమతులు ఇవ్వకపోవడం వివాదంగా మార్చడం అనేది పోలీసులకు, ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రతిసారీ వారికి కోర్టు మొట్టికాయలు వేస్తున్నా సరే బుద్ధి రావడం లేదు.